టీవీ ఛానల్ లో ఏడ్చేసిన సానియా | Sania Mirza breaks into tears over 'Pakistan' taunt | Sakshi
Sakshi News home page

టీవీ ఛానల్ లో ఏడ్చేసిన సానియా

Jul 26 2014 8:03 AM | Updated on Sep 2 2017 10:52 AM

టీవీ ఛానల్ లో ఏడ్చేసిన సానియా

టీవీ ఛానల్ లో ఏడ్చేసిన సానియా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓ ఇంగ్లీష్ టీవీ చానెల్‌లో ఏడ్చేసింది.

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓ ఇంగ్లీష్ టీవీ చానెల్‌లో ఏడ్చేసింది. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి దేశానికి ఎన్నో పతకాలు అందించిన తాను భారత జాతీయతను ఎన్నిసార్లు నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళను అయినందుకే నా పట్ల ఇలా జరుగుతోందా? వేరే దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకా? ఎందుకీ అపహాస్యం? నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పతకాలూ సాధించాను.

 నాతో పాటు నా కుటుంబ మూలాలను ప్రశ్నిస్తే సహించేది లేదు. నేను ఆడుతున్నప్పుడు తెలంగాణకు, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే లెక్క. మున్ముందు ఇలాగే కొనసాగుతుంది. జీవించి ఉన్నంత వరకు నేను భారతీయురాలినే’ అని మరోమారు సానియా స్పష్టం చేసింది. ఇక పదేపదే తనను ఏదో ఒక వివాదాల్లోకి లాగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘నా జాతీయత విషయంలో వివాదం తలెత్తడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. నా జాతీయతను, దేశభక్తిని నేను ఎన్నిసార్లు నిరూపించుకోవాలి. వేరే దేశంలో అయితే ఇలాగే జరిగేదా?’ అని సానియా ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన నేపథ్యంలో వస్తున్న వివాదాలపై సానియా ఇలా స్పందించింది.

 సైనాకు న్యాయం జరుగుతుంది
 సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ పతకం సాధించిన తనకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక మద్దతు లభించలేదన్న సైనా నెహ్వాల్ వ్యాఖ్యలకు సానియా స్పందించింది. ‘క్రీడాకారులకు గుర్తింపు లభించడం లేదని నేను చెప్పలేను. ఈ విషయంలో నేను కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడాను. సైనాకు సమాధానమిచ్చానని ఆయన నాతో చెప్పారు. కాబట్టి నేను ఈ అంశంపై మాట్లాడలేను. నా స్నేహితురాలైన సైనా రాష్ట్రానికి, దేశానికి ఎంతో చేసింది. ఆమెకు న్యాయం జరుగుతుంది’ అని సానియా చెప్పింది. సైనా విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు చొరవ తీసుకుంటారన్న విశ్వాసం తనకుందని పేర్కొంది.

 మరో వివాదాస్పద వ్యాఖ్య బెస్ట్‌ను కొట్టాల్సిందంటూ ట్వీట్
 ముంబై: ఇప్పటికే వివాదాల్లో ఉన్న సానియా మీర్జా తాజాగా ఓ ట్వీట్‌తో మరో వివాదానికి తెరలేపింది. తన భర్త... వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్‌ను కొట్టాల్సిందంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షోయబ్ మాలిక్ బార్బడోస్ జట్టు తరఫున ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియాకు ఆడుతున్న బెస్ట్, మాలిక్ మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా... హోటల్‌కు వెళ్లాక పరస్పరం నెట్టుకున్నారు. వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది. లీగ్ నిర్వాహకులు ఇద్దరు క్రికెటర్లకు జరిమానా విధించి వివాదాన్ని ముగించారు.

 అయితే ఈ సంఘటనపై సానియా చేసిన ట్వీట్ కలకలం రేపింది. ‘క్రికెట్ మైదానంలో జాతి వివక్ష దూషణలా? చాలా అసహ్యంగా ఉంది. టినో బెస్ట్ ఇడియట్. లాగి ఒక్కటి కొట్టాల్సింది. షోయబ్ మాలిక్ అతన్ని కొట్టలేదు కానీ.. ఆ పని చేసి ఉండాల్సింది’ అంటూ ట్వీట్ చేసింది. ఓ క్రీడాకారిణి అయి ఉండి ఆటల్లో ఉండే ఉద్వేగాలు తెలిసి ఇలా వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement