అరంగేట్రంలోనే డిమెరిట్‌ పాయింట్‌

Saini Given Demerit Point For Breaching ICC Code - Sakshi

లాడర్‌హిల్‌(అమెరికా): తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తాచాటిన టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ దూకుడుగా ప్రవర్తించి ఐసీసీ మందలింపుకు గురయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో నికోలస్‌ పూరన్‌ను ఔట్‌ చేసిన క్రమంలో సైనీ అతిగా ప్రవర్తించాడు. పూరన్‌కు సెండాఫ్‌ ఇస్తూ పెవిలియన్‌కు దారి చూపించాడు. ఇది ఐసీసీ ఆర్టికల్‌ 2.5 నియమావళికి విరుద్ధం కావడంతో సైనీకి మందలింపుతో పాటు ఒక డిమెరిట్‌ పాయింట్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని సోమవారం ఐసీసీ ఒక ప్రకటనలో స్సష్టం చేసింది.

తన తప్పును సైనీ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండా ఒక డిమెరిట్‌ పాయింట్‌ కేటాయించామని మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో పేర్కొన్నారు.  24 నెలల కాలంలో ఒక ఆటగాడు ఖాతాలో నాలుగు అంతకంటే ఎక్కువ డిమెరిట్‌ పాయింట్లు చేరితే అతనిపై సస్పెన్షన్‌ వేటు తీవ్రంగా ఉంటుంది. సదరు ఆటగాడిని నిషేధించే అధికారం ఐసీసీకి ఉంది. రెండు డిమెరిట్‌ పాయింట్లు చేరితే మాత్రం ఒక టెస్టు కానీ రెండు వన్డేలు కానీ, రెండు టీ20లు కానీ నిషేధం విధిస్తారు. తొలి టీ20లో సైనీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి ఓవర్‌ నుంచి విండీస్‌ ఆటగాళ్లపై నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. దాంతో సైనీని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ విండీస్‌ 95 పరుగులు మాత్రమే చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top