వరల్డ్‌ చాంపియన్‌షిప్‌‌: సైనా కథ ముగిసింది!

Saina Nehwal lose in quarters of Badminton World Championship - Sakshi

నాన్‌జింగ్‌ (చైనా): బ్యాడ్మింటన్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప‌దో సీడ్‌ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ 8 క్రీడాకారిణి ఒలింపిక్‌ విజేత కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో సైనా చిత్తుగా ఓడింది. అద్భుత ప్రదర్శనతో మారిన్‌ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఓ సారి రజతం (2015), మరో సారి కాంస్యం (2017) సాధించిన సైనా మారిన్‌కు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్ వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 21-6, 21-11 తేడాతో విజయం సొంతం చేసుకుంది. మారిన్‌ దెబ్బకు కేవ‌లం 31 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసింది. 
కోర్టులో చిరుతలా కదిలిన మారిన్ మెరుపు షాట్లకు సైనా సమాధానం ఇవ్వలేకపోయింది. 2015లో వీరిద్దరూ ఈ చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడగా అప్పుడు కూడా కరోలినాదే పైచేయి సాధించింది.

కోర్టులో మారిన్‌ అత్యంత వేగంగా కదిలిందని, అద్బుతమైన ప్రదర్శన చేసిందని మ్యాచ్‌ అనంతరం సైనా కొనియాడింది. ఆమె వేగంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదని, ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని సైనా చెప్పుకొచ్చింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో నిరాశే..
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ సైతం పరాజయం పాలైంది. టాప్‌ సీడ్‌ జెంగ్‌ సివే– హుయంగ్‌ యకిఒంగ్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో 21-17, 21-10 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top