చెలరేగిన సాహా

చెలరేగిన సాహా


ముంబై:గుజరాత్ తో జరిగిన ఇరానీ కప్లో  రెస్టాఫ్ ఇండియా ఆటగాడు వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయాడు. సుదీర్ఘంగా క్రీజ్లో నిలబడి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరిగిన మూడు టెస్టులకు దూరమైన సాహా..ఇరానీ కప్ లో  కీలక ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. 


 


272 బంతుల్లో 26 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 203 పరుగులు చేసి రెస్టాఫ్ ఇండియాకు చిరస్మణీయమైన విజయాన్ని అందించాడు. మరో ఆటగాడు చటేశ్వర పూజారా(116 నాటౌట్) తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు.  వీరిద్దరూ అజేయంగా 316 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.



గుజరాత్ విసిరిన 379 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రెస్టాఫ్ ఇండియాను సాహా-పూజారాలు ఆదుకున్నారు.  తొలి మూడు రోజులు గుజరాత్ పూర్తి ఆధిపత్యం కొనసాగించినా, నాల్గో రోజు నుంచి మ్యాచ్ రెస్టాఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్లింది.



266/4 ఓవర్ నైట్ స్కోరు మంగళవారం ఐదో రోజు ఆటను కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా మరో వికెట్ పడకుండా గెలుపును సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు పూజారా సెంచరీ నమోదు చేయగా, సాహా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.ప్రధానంగా పార్థివ్‌ పటేల్‌కు పోటీగా తన బ్యాటింగ్‌ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top