సాహాకు తిరుగులేదు.. పంత్‌కు చోటులేదు!

Saha Best International Wicket Keeper Pant Not In Top Five - Sakshi

న్యూఢిల్లీ:  సుదీర్ఘ విరామం తర్వాత టెస్టులో పునరాగమనం చేసిన భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌ తొలి రెండు టెస్టుల్లో పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాని సాహా.. కీపర్‌గా మాత్రం అదుర్స్‌ అనిపించాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా కదులుతూ అద్భుతమైన క్యాచ్‌లతో అలరించాడు.  ప్రధానంగా రెండో టెస్టులో డిబ్రుయిన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇచ్చిన క్యాచ్‌లను కళ్లు చెదిరే రీతిలో అందుకున్న సాహా.. డుప్లెసిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను అత్యంత సమన్వయంతో పట్టుకున్నాడు. బంతి రెండుసార్లు చేతుల్లోంచి జారిపోయినా నియంత్రణ కోల్పోకుండా బంతిని వేటాడి మరీ డుప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీనిపై డుప్లెసిస్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం మినహా చేసేదేమీ లేకపోయింది.

ఇదిలా ఉంచితే,  ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో సాహానే బెస్ట్ వికెట్ కీపర్‌ అని గణాంకాలు చెప్తున్నాయి. 2017 నుంచి ఈరోజు వరకూ పేస్‌ బౌలింగ్‌లో సాహా వికెట్ల వెనుక గోడలా ఉన్నాడని తాజా గణాంకాలే చెబుతున్నాయి. బంతుల్ని కచ్చితమైన దృష్టితో ఆపడమే కాకుండా క్యాచ్‌లను అందుకోవడంలో కూడా సాహా టాప్‌లో నిలిచాడు. తాజాగా ఓ క్రికెట్‌ వెబ్‌సైట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం సాహానే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ రెండేళ్లలో కనీసం 10 క్యాచ్‌లు పట్టిన కీపర్ల జాబితాని పరిశీలిస్తే..  సాహా 96.9 శాతం క్యాచ్‌ల్ని అందుకుని అగ్రస్థానంలో నిలవగా..  శ్రీలంక కీపర్ డిక్వెల్లా 95.5 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు.

ఇక భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మాత్రం టాప్‌-5లో చోటు దక్కలేదు.  పంత్‌ 91.6 శాతంతో 9వ స్థానానికి పరిమితమయ్యాడు. గత ఏడాది జనవరిలో గాయం కారణంగా భారత్ జట్టుకి సాహా దూరమవగా అతని స్థానంలో పంత్‌ అవకాశం దక్కించుకున్నాడు.  ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీలతో అదరగొట్టాడు. అటు తర్వాత పంత్‌ వెనుకబడ్డాడు. అటు బ్యాటింగ్‌లోనూ కీపింగ్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించకపోగా పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో సఫారీలతో సిరీస్‌కు పంత్‌ను తప్పించి సాహాకు అవకాశం కల్పించారు. తనకు వచ్చిన అవకాశాన్ని సాహా తన సమర్థతతో వినియోగించుకోవడంతో హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top