నా తొలి బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ అదే: సచిన్‌

Sachin Says Didnt Get Selected in His 1st Selection Trails - Sakshi

ముంబై : ఏ కంటి వెనుక ఏ కన్నీరు దాగుందో ఎవరికి తెలుసు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అనగానే అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్‌, క్రికెట్‌ గాడ్‌, విజయాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌ ఇవి మాత్రమే అందరికీ తెలుసు. అయితే సచిన్‌ జీవితం పూల బాట కాదని ముళ్లదారని కొందరికి మాత్రమే తెలుసు. క్రికెట్‌లో, లైఫ్‌లో విజయం తప్ప అపజయం లేదని అందరూ భావిస్తారు. కానీ తన జీవితానికి సంబంధించి తొలి బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ను సచిన్‌ తెలిపాడు. పశ్చిమ మహారాష్ట్రలోని ఓ పాఠశాలకు సచిన్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మూడు కొత్త తరగతి గదులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టేజ్‌, గ్రౌండ్‌ నిర్మాణం కోసం తన ఎంపీ నిధులను మంజూరు చేశాడు. కాగా ఆ పాఠశాలలోని కొత్త తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సచిన్‌ విద్యార్దులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహపడుకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నాడు. తన తొలి సెలక్షన్‌ ట్రయల్స్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొంటూ తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. 

ఫైల్‌ ఫోటో

‘నాకు ఊహతెలిసినప్పట్నుంచి భారత్‌ తరుపున క్రికెట్‌ ఆడాలనేది నా కల. అందుకోసం నిరంతరం శ్రమించాను. నాపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అప్పటికీ బ్యాటింగ్‌ బాగా చేస్తున్నావని కోచ్‌లతో సహా సీనియర్లు మెచ్చుకున్నారు.  దీంతో సులువుగా అండర్‌-11కు సెలక్ట్ అవుతానని భావించాను. కానీ నా ఆట ఇంకా పరిణితి చెందలేదని, ఇంకా తీవ్రంగా కష్టపడాలని సెలక్టర్లు నన్ను పక్కకు పెట్టారు. దీంతో తొలి సెలక్షన్‌ ట్రయల్స్‌లోనే నిరాశ ఎదురవడంతో.. టీమిండియాకు ఆడతానా లేదా అనే భయం మనసులో కలిగింది. తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే బాధపడుతూ కూర్చోకుండా నా బ్యాటింగ్‌ లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకాస్త ఎక్కువగా కష్టపడ్డాను. టీమిండియాకు ఆడాను విజయం సాధించాను. ఈ విజయాల పరంపరలో నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యా పిల్లల సహకారం మర్చిపోలేనిది. నా సోదరి  బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌ ఇప్పటికీ నాకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తాను. గురువు ఆచ్రేకర్‌ లేనిదే నేను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు. ఫైనల్‌గా విద్యార్థులందరికీ చెప్పదల్చుకునేది ఒకటే.  విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాల్సిందే.. విజయానికి షార్ట్‌ కట్స్‌ ఉండవు’అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top