
రష్యాను ఆదుకున్న కెర్జకోవ్
పన్నెండేళ్ల తరువాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రష్యా.. ఆరంభ మ్యాచ్‌లో ఓటమి నుంచి కొద్దిలో తప్పించుకుంది.
కొరియాతో మ్యాచ్ 1-1తో డ్రా
సియాబా: పన్నెండేళ్ల తరువాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రష్యా.. ఆరంభ మ్యాచ్‌లో ఓటమి నుంచి కొద్దిలో తప్పించుకుంది. అలెగ్జాండర్ కెర్జకోవ్ సూపర్ గోల్‌తో ఆదుకోవడంతో కొరియా రిపబ్లిక్‌తో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తమ తొలిమ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగంలో గోల్స్ చేయడంలో ఇరు జట్లూ విఫలమయ్యాయి. అయితే ద్వితీయార్ధంలో పార్క్ చుయంగ్ స్థానంలో మైదానంలోకి వచ్చిన లీ క్యున్ హో 68వ నిమిషంలో గోల్ సాధించి కొరియా శిబిరంలో ఆనందం నింపాడు. కానీ ఆ ఆనందం కొరియాకు ఎంతోసేపు నిలవలేదు.
రష్యా కూడా యూరీ జిర్కోవ్ స్థానంలో కర్జకోవ్‌ను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపింది. మైదానంలోకి అడుగు పెట్టిన మూడు నిమిషాలకే కర్జకోవ్ 74వ నిమిషంలో గోల్ నమోదు చేసి స్కోరును సమం చేశాడు. మొత్తంగా బంతి రష్యా (43 శాతం)కన్నా కొరియా (53 శాతం) ఆధీనంలోనే ఎక్కువ సమయం ఉంది. రష్యా 15 ఫౌల్స్ చేయగా, కొరియా 7 ఫౌల్స్ మాత్రమే చేసింది. కొరియా మిడ్‌ఫీల్డర్ సన్ హ్యుంగ్‌మిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.