హిట్‌మ్యాన్‌ ఫ్లాప్‌ ఫో

Rohit Sharma's failure in the ODIs - Sakshi

వన్డేల్లో రోహిత్‌ శర్మ ఘోర వైఫల్యం

దక్షిణాఫ్రికా గడ్డపై పేలవ ప్రదర్శన

టెక్నిక్‌ లోపంతో సమస్యలు   

పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ కోసం రోహిత్‌ శర్మ వెళితే అక్కడి అధికారి నువ్వేం చేసినా ఇండియాలోనే కదా, విదేశాలకు వెళ్లి చేసేదేముంది, నీకు రెన్యువల్‌ అవసరమా అని బదులిచ్చాడు.
గల్లీ క్రికెట్‌లో ట్రయల్‌ బాల్‌ వేసి ఆ తర్వాత ఆట మొదలు పెడతారు కదా! ఈ సిరీస్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేయడం కూడా అలాంటిదే.
రోహిత్‌ పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు సిరీస్‌కు ఒకసారి వస్తే ఎంత బాగుంటుంది కదా!
రోహిత్‌ తన కిట్‌లో భారత పిచ్‌ను కూడా తీసుకువెళ్లి ఆడుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది.  

దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస వైఫల్యాల తర్వాత భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై వస్తున్న అసంఖ్యాక వ్యంగ్య వ్యాఖ్యానాల్లో ఇవి కొన్ని! వన్డే క్రికెట్‌ అనగానే చెలరేగిపోయే అతనికి సఫారీ గడ్డ ఏమాత్రం అచ్చి రావడం లేదు. నాలుగు మ్యాచ్‌లలో వరుసగా చేసిన 20, 15, 0, 5 స్కోర్లు రోహిత్‌ స్థాయికి ఏమాత్రం తగనివి. మొత్తానికి  రెగ్యులర్‌ ఓపెనర్‌ ఫామ్‌ భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కొత్త సమస్యగా మారింది.   

సాక్షి క్రీడా విభాగం
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌ శర్మ 11, 10, 10, 47 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టెస్టుల్లో రోహిత్‌ ఆటపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అతడిని తుది జట్టులోకి తీసుకోవడంపైనే అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. చివరకు మూడో టెస్టులో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పైగా దక్షిణాఫ్రికా భీకర పేస్‌ బౌలింగ్‌లో కోహ్లి మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ విఫలమైన చోట రోహిత్‌ వైఫల్యాలు కూడా పెద్దగా కనిపించలేదు.

కానీ వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన మొనగాడు అదే ఫార్మాట్‌లో తడబడుతున్న తీరు అమితాశ్చర్యం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో రోహిత్‌కిది మూడో పర్యటన. 2011, 2013లలో ఇక్కడ ఆడిన వన్డేల్లో కూడా అతను ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఏడు వన్డేల్లో అతను వరుసగా 11, 9, 23, 1, 5, 18, 19 చొప్పున పరుగులు చేశాడు.

గత సిరీస్‌లో జొహన్నెస్‌బర్గ్‌ వన్డేలోనైతే 16వ బంతికి గానీ అతను కనీసం బ్యాట్‌ను బాల్‌కు తాకించలేకపోయాడు! అయితే నాటి రోహిత్‌తో పోలిస్తే ఈ నాలుగేళ్ళలో అతను ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తే అతని తాజా వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2013 డిసెంబర్‌లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌ తర్వాత 2014, 15, 16, 17 సంవత్సరాలలో కలిపి అతను 59.49 సగటుతో 3250 పరుగులు సాధించాడు. ఇలాంటి ఫామ్‌తో సఫారీ గడ్డపైకి వచ్చిన అతను అనూహ్యంగా విఫలమయ్యాడు.  

ఇక్కడ మాత్రమే...  
రోహిత్‌ భారత్‌లో మాత్రమే బాగా ఆడతాడనే విమర్శలో కూడా వాస్తవం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై అతను నాలుగు సెంచరీలు సహా 51.95 సగటుతో పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ మైదానాల్లో కూడా 53.30 సగటుతో పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్‌ పిచ్‌లపై కూడా ఎనిమిది ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు వచ్చే సరికి మాత్రం అతని ఆట గతి తప్పుతోంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్టెన్‌ వెసెల్స్‌ ... ‘రోహిత్‌ ఫుట్‌వర్క్‌లోనే సమస్య ఉంది. దక్షిణాఫ్రికాలో సహజంగానే వేగం, బౌన్స్‌ కలగలిసి బంతులు వస్తాయి.

ఆఫ్‌సైడ్‌ వైపు జరిగి ఆడేటప్పుడు అతని స్టాన్స్‌ సరిగా ఉండటం లేదు. దాని వల్లే అతను విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో బౌన్స్‌ మాత్రమే ఉంటుంది. దానికి తగినట్లుగా బ్యాట్స్‌మెన్‌ తనను తాను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ బౌన్స్‌కు పేస్‌ తోడైతే కష్టం’ అని విశ్లేషించారు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఇటీవల చాలా వరకు పిచ్‌లు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోగా, సౌతాఫ్రికాలో ఇంకా అలాంటి పరిస్థితి లేకపోవడం కూడా రోహిత్‌కు ప్రతికూలంగా మారిందనేది మరో రకమైన విశ్లేషణ.  

నేర్చుకుంటాడా!
తాజా సిరీస్‌లో అతను నాలుగు సార్లు ఔటైన తీరు చూస్తే రోహిత్‌ ఒకే తరహాలో ఔటవుతున్నాడని కూడా చెప్పలేం. మొదటి రెండు వన్డేల్లో షార్ట్‌ పిచ్‌ బంతులను హుక్‌ చేయబోయి అతను వెనుదిరిగాడు. బౌన్స్‌ తక్కువగా ఉండే పిచ్‌లపై అతని షాట్‌ భారీ సిక్సర్‌గా మారేదేమో గానీ ఇక్కడ కాదు. మూడో వన్డేలో వేగంగా దూసుకొచ్చిన ఇన్‌స్వింగర్‌ రోహిత్‌ పాత సమస్యను బయట పెట్టింది. ఆ బంతిని ఆడాలా వద్దా తేల్చుకునే లోపే బ్యాట్‌కు తగిలి కీపర్‌ చేతుల్లో పడింది.

నిజానికి ఇదే బలహీనత అతడిని టెస్టులకు పనికి రాకుండా చేసింది. శనివారం వన్డేలో సమర్థంగా డిఫెన్స్‌ ఆడలేక రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. వన్డేల్లో అత్యద్భుత రికార్డులు తన పేరిట ఉన్నా టెక్నిక్‌ పరంగా రోహిత్‌లో చాలా సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. చీఫ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పాత్ర గురించి చెప్పలేం కానీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఇలాంటి లోపాలను సరిదిద్దడంలో సిద్ధహస్తుడు. కాబట్టి దానిపై దృష్టి పెడితే తనేంటో చూపించుకునేందుకు రోహిత్‌కు మరో రెండు వన్డేలు ఉన్నాయి.  
ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాలో రోహిత్‌ శర్మ 11 వన్డే ఇన్నింగ్స్‌లలో కలిపి 126 పరుగులే చేయగలిగాడు. సగటు 11.45 కాగా అత్యధిక స్కోరు 23 మాత్రమే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top