
‘నా ఆట చూసేందుకు సమైరా ప్రతిసారి ఇక్కడకు వస్తుంది. అయితే ఇంతకుముందు పెద్దగా పరుగులు చేయలేకపోయాను.
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సాధించిన 36వ అర్ధ సెంచరీని తన కూతురు సమైరాకు అంకితమిచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో ఆదివారం ఇక్కడి వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ టీమ్ టాప్‌లో నిలిచింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నా ఆట చూసేందుకు సమైరా ప్రతిసారి ఇక్కడకు వస్తుంది. అయితే ఇంతకుముందు పెద్దగా పరుగులు చేయలేకపోయాను. మొత్తానికి ఈరోజు కొన్ని పరుగులు చేశాను. నా ఆట చూడకుండానే సమైరా నిద్రపోయింద’ని అన్నాడు. కూతురిని ఒళ్లో కూర్చొబెట్టుకుని ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇలాంటి మధురమైన క్షణాల కోసమే ఎదురు చూసినట్టు పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం మైదానంలో మంగళవారం జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.