నా మదిలో నుంచి అది వెళ్లడం లేదు : పంత్‌

Rishabh Pant Says World Cup Selection Played on My Mind - Sakshi

జైపూర్‌ : ఇంకా తన మదిలో నుంచి ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ప్రక్రియ వెళ్లడం లేదని యువ వికెట్‌ కీపర్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ తెలిపాడు. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ (36 బంతుల్లో 78 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్‌ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతు ల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్‌ స్మిత్‌ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది.

ధావన్‌ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ దాటిగా ఆరంభించగా.. రిషభ్‌ పంత్‌ మెరుపులతో కొండంత లక్ష్యం చిన్నబోయింది. అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న పంత్‌.. తన ఆలోచనల్లో నుంచి మాత్రం ప్రపంచకప్‌ ఎంపిక ప్రక్రియ వెళ్లడం లేదన్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘క్లిష్ట పరిస్థితిల్లో జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరు. ఏది ఎమైనప్పటికి ప్రపంచకప్‌ విషయం మాత్రం నన్ను వదలడం లేదు. కానీ నేను మాత్రం నా కెరీర్‌పై దృష్టి సారించాను. ఈ పిచ్‌ అద్భుతంగా ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగిపోయాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసు. సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా చెబుతుంది. ఇది నీ కర్తవ్యం.. నువ్వు చెయ్యాల్సింది ఇదని వారు ఎప్పుడూ చెబుతుంటారు. దాంతోనే ఈ అద్భుత ఇన్నింగ్స్‌ సాధ్యమైంది’ అని పంత్‌ అభిప్రాయపడ్డాడు. ఆఖరి వరకు పంత్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటుదక్కుతుందని భావించగా.. సెలక్టర్లు అనుభవానికి ఓటేస్తూ దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top