నేలకు కొట్టిన బంతిలా.. రషీద్‌ ఖాన్‌ | Rashid Khan Says It Was Tough After Two Bad Games | Sakshi
Sakshi News home page

Apr 27 2018 3:31 PM | Updated on Apr 27 2018 4:25 PM

Rashid Khan Says It Was Tough After Two Bad Games - Sakshi

రషీద్‌ ఖాన్‌

హైదరాబాద్‌ : అఫ్గాన్‌ యువ సంచలనం, సన్‌రైజర్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ నేలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నాడు. మొహాలిలో  విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ చేతిలో చిత్తైన రషీద్‌.. చెన్నైసూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఓటమి చవిచూసింది. అనంతరం తప్పిదాలను సవరించుకొని తనదైన ప్రణాళికలతో బరిలోకి దిగిన ఈ అఫ్గాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ముంబై, పంజాబ్‌లపై రాణించి సన్‌రైజర్స్‌కు వరుస విజయాలందించాడు. ఇక ఈ రెండు జట్లపై సన్‌రైజర్స్‌ అత్యల్ప స్కోర్‌లను కాపాడుకోవడం విశేషం.

గురువారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన రషీద్‌ (3/19)తో స్వల్ప స్కోర్‌ను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. రెండు ఓటములతో తనకు కఠిన సవాల్‌ ఎదురైందని అభిప్రాయపడ్డాడు. ‘ చెన్నై, పంజాబ్‌లతో ఓటమి అనంతరం నాకు కఠిన సవాల్‌ ఎదురైంది. ఈ పరిస్థితుల్లో కోచింగ్‌ బృందం మద్దతుగా నిలిచింది. వారు కేవలం నీ ఆటను ఆస్వాదించు అని చెప్పారు. కెప్టెన్‌ అవసరం మేరకు ఏ పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేయడానికి నేను సిద్దం. పవర్‌ ప్లే, మిడిల్‌, చివర్లో ఎప్పుడైనా నేను సిద్దమే. తక్కువ స్కోర్‌లతో గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మా ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్‌ చేశారు. మేం ఇది ఇలానే కొనసాగిస్తాం. ఇక ఈ మ్యాచ్‌లో మేం కొన్ని పరుగులు చేయాల్సింది’ అని వ్యాఖ్యానించాడు.

ఇది బౌలర్ల విజయం: విలియమ్సన్‌
ఈ విజయానంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఈ విజయం బౌలర్లదని అభిప్రాయపడ్డాడు. ‘ఈ అత్యల్ప స్కోరును కాపాడుకోవడం అత్యద్బుతం. కానీ మేం బ్యాటింగ్‌లో ఇంకా రాణించాలి. నేను 180 పరుగుల గురించి మాట్లాడటం లేదు. ఈ మ్యాచ్‌లో కనీసం 145, 155 పరుగులు చేయాల్సింది. మా బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. మా ఫీల్డింగ్‌ కూడా బాగుంది. కీలక బౌలర్లు గాయాలతో దూరమైన వారిస్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ఇలాగే గట్టి పోటినిస్తాం. ఇక ఈ విజయం మాత్రం పూర్తిగా బౌలర్లదే’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement