బెంగాల్‌తో ఓజా ‘ఆట’ ముగిసింది!

 Ranji team is the place to get Ojha

రంజీ జట్టులో దక్కని చోటు   

కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా దేశవాళీ కెరీర్‌ స్వయంకృతంతో ప్రమాదంలో పడింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బెంగాల్‌ జట్టును మంగళవారం ప్రకటించినా... అందులో ఓజాకు చోటు దక్కలేదు. అతడు చాలా రోజులుగా తమకు అందుబాటులోనే లేడని, అందువల్ల ఓజా గురించి కనీసం చర్చించలేదని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శి అవిశేక్‌ దాల్మియా వెల్లడించారు. ఇటీవల బెంగాల్‌ జట్టు కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరానికి కూడా ఓజా హాజరు కాలేదు.  హైదరాబాద్‌ తరఫున రెగ్యులర్‌గా రంజీ ఆడిన ఓజా 2015–16, 2016–17 సీజన్‌లలో బెంగాల్‌కు ఆడాడు. తమకు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అవసరం ఉందంటూ సౌరవ్‌ గంగూలీ స్వయంగా ఓజాను పిలిచి ప్రోత్సహించారు.

అయితే ఈ ఏడాది సొంత జట్టు హైదరాబాద్‌కు ఆడేందుకు ఆసక్తి చూపించిన ఓజాకు నిరభ్యంతరకర పత్రం ఇచ్చేందుకు గంగూలీ నిరాకరించారు. అప్పటి నుంచి అతను ‘క్యాబ్‌’ అధికారులకు అందుబాటులో లేకుంండా పోయాడు. ట్విట్టర్‌లో మాత్రం అతను తరచుగా పోస్టింగ్‌లు పెడుతూ చురుగ్గా ఉండటం విశేషం. బెంగాల్‌ తిరస్కరించడంతో ఈ ఏడాది ఏ జట్టుకు కూడా రంజీలు ఆడే అవకాశం లేని ఓజా కెరీర్‌ ఇక ముందు కూడా కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. భారత్‌ తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టిన ఓజా... 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టి20 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top