ఫ్రాన్స్ దూకుడు | Rampant France team draws highest TV ratings at home since 2006 final | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ దూకుడు

Jun 22 2014 1:34 AM | Updated on Oct 22 2018 5:58 PM

ఫ్రాన్స్ దూకుడు - Sakshi

ఫ్రాన్స్ దూకుడు

నాలుగేళ్లలో ఎంత మార్పు.. ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టు ప్రదర్శనను గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.

నాలుగేళ్లలో ఎంత మార్పు.. ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టు ప్రదర్శనను గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ మెగా ఈవెంట్‌లో ఫ్రాన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే అవమానకర రీతిలో నిష్ర్కమించింది. ఈసారి మాత్రం తమ లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దుకుని మంచి సమతూకంతో బరిలోకి దిగి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి దాదాపుగా నాకౌట్ దశకు చేరుకుంది.
 
5-2తో స్విట్జర్లాండ్‌పై ఘనవిజయం
సాల్వెడార్: చాంపియన్ తరహా ఆటతీరుతో అదరగొడుతున్న ఫ్రాన్స్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగైన స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి నాకౌట్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’ లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 5-2 తేడాతో ఫ్రాన్స్ గెలిచింది.

1958 ప్రపంచకప్ తర్వాత ఓ మ్యాచ్‌లో ఐదు అంతకన్నా ఎక్కువ గోల్స్ సాధించడం ఫ్రాన్స్‌కు ఇదే తొలిసారి. మరోవైపు ఈ మైదానంలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ వర్షం కురవడం విశేషం. నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌ను, జర్మనీ 4-0తో పోర్చుగల్‌ను ఇక్కడే మట్టికరిపించాయి. ఇదే స్థాయిలో ఫ్రాన్స్ కూడా ఆద్యంతం ఆధిపత్యం చూపుతూ స్విస్‌ను తేరుకోనీయలేదు. ఫ్రాన్స్ తరఫున గిరౌడ్, మటౌడి, వాల్బుయేనా, బెంజెమా, సిసోకో గోల్స్ సాధించగా స్విస్ తరఫున జెమైలి, జాకా చెరో గోల్ చేశారు.
     
మ్యాచ్ ప్రారంభమైంది మొదలు ఫ్రాన్స్ ఆటగాళ్లు చెలరేగారు. దీంతో 17వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. వాల్బుయేనా కొట్టిన కార్నర్ కిక్‌ను స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్‌కు ఇది వందో గోల్ కావడం విశేషం.
     
దీన్నుంచి తేరుకునేలోపే స్విస్‌కు మరో షాక్ తగిలింది. సరిగ్గా 66 సెకన్ల (18వ ని.) అనంతరం స్విస్ పేలవ డిఫెన్స్‌ను సొమ్ము చేసుకుంటూ బెంజెమా అందించిన పాస్‌ను మటౌడీ గోల్ చేసి జట్టును ఆనందంలో ముంచెత్తాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో అత్యంత స్వల్ప విరామంలో నమోదైన గోల్ ఇదే.
     
32వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో స్టార్ స్ట్రయికర్ బెంజెమా విఫలమయ్యాడు. స్విస్ గోల్‌కీపర్ బెనగ్లియో కుడి వైపునకు వంగి తక్కవ ఎత్తులో వచ్చిన బంతిని సులువుగానే ఒడిసిపట్టుకున్నాడు.
     
అయితే స్విస్‌కు ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో(40వ ని.)నే గిరౌడ్ ఇచ్చిన పాస్‌ను ఆరు గజాల దూరం నుంచి వాల్బుయేనా గోల్‌గా మలిచి జట్టుకు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.
     
ద్వితీయార్ధంలో స్విస్ ఆటగాళ్లు పోటీనిచ్చినప్పటికీ ఫ్రాన్స్‌ను గోల్స్ చేయకుండా ఆపలేకపోయారు. 67వ నిమిషంలో పోగ్బా ఇచ్చిన పాస్ ను బెంజెమా గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఇది తనకు మూడో గోల్.
     
72వ నిమిషంలో బెంజెమా ఇచ్చిన పాస్‌ను సిసోకో గోల్ చేశాడు.
     
చివర్లో ఆరు నిమిషాల వ్యవధి (81,87వ ని.)లో స్విట్జర్లాండ్‌కు రెండు గోల్స్ లభించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement