పరాగ్‌ ప్రతాపం

Rajasthan Royals beat Kolkata Knight Riders by 3 wickets  - Sakshi

కీలక ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను గెలిపించిన టీనేజర్‌

రాణించిన ఆరోన్, ఆర్చర్‌

దినేశ్‌ కార్తీక్‌  అద్భుత ఇన్నింగ్స్‌ వృథా ​​​​​​

కోల్‌కతాకు వరుసగా ఆరో ఓటమి   

ప్లే ఆఫ్స్‌ రేసు ముంగిట... అది కూడా సొంతగడ్డపై... కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద షాక్‌. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆ జట్టుకు అనూహ్య ఓటమి. పేలవ బ్యాటింగ్‌తో తొలుత తమ చేజారినట్లే కనిపించిన మ్యాచ్‌ను... కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (50 బంతుల్లో 97; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో నిలిపినా, సాధారణ స్కోరును స్పిన్నర్లు పీయూష్‌ చావ్లా (3/20), సునీల్‌ నరైన్‌ (2/25) కాపాడినట్లే కనిపించినా... రాజస్తాన్‌ రాయల్స్‌ టీనేజ్‌ సంచలనం.

 17 ఏళ్ల అసోం కుర్రాడు రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అసాధారణ పోరాటానికి కోల్‌కతా తలొంచక తప్పలేదు. సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన ఈ యువ క్రికెటర్లు... ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి రాయల్స్‌ను విజేతగా నిలిపారు. 

కోల్‌కతా: ఓటమి తప్ప మరే దారీ లేదన్న దశలో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుతమే చేసింది. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడిన రాయల్స్‌ కుర్రాళ్లు పరాగ్, ఆర్చర్‌... కోల్‌కతాకు వరుసగా ఆరో పరాజయం ఖాయం చేశారు. రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను దినేశ్‌ కార్తీక్‌ అజేయ ఇన్నింగ్స్‌తో నడిపించాడు. రాయల్స్‌ పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌ (2/20) ధాటికి ఇతర బ్యాట్స్‌మెన్‌ ఓ మాదిరిగానూ ఆడకున్నా కార్తీక్‌ ఒంటరి పోరాటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

ఛేదనలో రాజస్తాన్‌కు ఓపెనర్లు అజింక్య రహానే (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సంజూ సామ్సన్‌ (15 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) మంచి పునాది వేశారు. ప్రత్యర్థి స్పిన్నర్ల దెబ్బకు ఓ దశలో కుదేలైన రాజస్తాన్‌ను ఏడో వికెట్‌కు 21 బంతుల్లో 44 పరుగులు జోడించి పరాగ్, ఆర్చర్‌ గెలుపు బాట పట్టించారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన స్థితిలో ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఆర్చర్‌ ఫోర్, సిక్స్‌ కొట్టి ముగించేశాడు. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి నెగ్గింది. ఆరోన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 11 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ఇది వరుసగా ఆరో పరాజయం. ఈడెన్‌లో నాలుగోది కావడం గమనార్హం. ఈ ఓటమితో ఆ జట్టు లీగ్‌లో ముందడుగేయడం కష్టమే. మరోవైపు రాయల్స్‌కు ఇది నాలుగో విజయం. 

అతడొక్కడు మినహా... 
పవర్‌ ప్లేలో 32/2, పది ఓవర్లకు 49/3... ఇదీ సగం ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ లిన్‌ (0)ను బౌల్డ్‌ చేసిన ఆరోన్‌... ఐదో ఓవర్లో మరో ఓపెనర్, శుబ్‌మన్‌ గిల్‌ (14) వికెట్లను గిరాటేశాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రాణా (21)ను శ్రేయస్‌ గోపాల్‌ వెనక్కు పంపాడు. ఐదులోపు రన్‌రేట్‌తో సాగుతున్న  ఇన్నింగ్స్‌కు గోపాల్‌ వేసిన 11వ ఓవర్లో కార్తీక్‌ సిక్స్, హ్యాట్రిక్‌ ఫోర్లు, సునీల్‌ నరైన్‌ (11) సిక్స్‌ కొట్టడంతో ఊపు వచ్చింది. 15వ ఓవర్‌ చివరి బంతికి కోల్‌కతా సరిగ్గా 100 పరుగులు చేసింది. సమయోచితంగా ఆడిన కార్తీక్‌ అర్ధ సెంచరీ (35 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. లైఫ్‌లు దక్కినా విధ్వంసక ఆటగాడు రసెల్‌ (14 బంతుల్లో 14; 1 సిక్స్‌) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కార్తీక్‌ మెరుపులతో చివరి 10 ఓవర్లలో 126 పరుగులు వచ్చాయి. ఆఖరి ఐదు ఓవర్లలోనే 75 పరుగులు దక్కాయి. 

మొదట వారు... తర్వాత వీరు 
రాయల్స్‌ ఓపెనర్లలో రహానే ఫోర్లతో పరుగులు రాబట్టగా, స్ట్రయిట్‌ సిక్సర్లతో సంజు ధాటిని చూపాడు. ఆంధ్ర క్రికెటర్‌ యర్రా పృథ్వీరాజ్‌ వేసిన ఐదో ఓవర్లో రహానే సిక్స్, రెండు ఫోర్లు సహా 17 పరుగులు రాబట్టడంతో స్కోరు 50 దాటింది. కానీ, పవర్‌ ప్లే చివరి ఓవర్లో నరైన్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం, పీయూష్‌ చావ్లా గూగ్లీకి శామ్సన్, నరైన్‌ స్ట్రయిట్‌ డెలివరీని ఎదుర్కొనలేక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (2) పేలవంగా బౌల్డవడంతో జట్టు కష్టాల్లో పడింది. 6 నుంచి 10 ఓవర్ల మధ్య ఆ జట్టు 25 పరుగులే చేసింది. చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్లకు యత్నించి స్టోక్స్‌ (11), బిన్నీ (11) వెనుదిరిగారు. అప్పటికి స్కోరు 98/5. విజయ సమీకరణం 45 బంతుల్లో 78. గోపాల్‌ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) హ్యాట్రిక్‌ ఫోర్లతో కొంత ఒత్తిడి తగ్గించాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ఔటైనా... పరాగ్, ఆర్చర్‌ ప్రశాంతంగా ఆడుతూ పని పూర్తి చేశారు. 

ఔరా కార్తీక్‌ 
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ‘దినేశ్‌ కార్తీక్‌ ఇన్నింగ్స్‌’ అనడం సబబేమో! జట్టు స్కోరు 31/2తో ఉండగా సరిగ్గా ఆరో ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్‌... ఆసాంతం నిలిచాడు. ఎదుర్కొన్న ఏడో బంతికి కానీ ఖాతా తెరవని అతడు... కుదురుకున్నాక తనదైన శైలిలో భారీ షాట్లు కొట్టాడు. 10 బంతుల్లో 3 పరుగులతో ఉన్న దశలో శ్రేయస్‌ గోపాల్‌ ఓవర్లో ఓవర్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌ కొట్టి జోరందుకున్నాడు.

ఆర్చర్‌ బంతిని అద్భుతమైన టైమింగ్‌తో ఫ్లిక్‌ చేసి సిక్స్‌గా పంపిన తీరు, ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌పై అరోన్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను ఓవర్‌ పాయింట్‌ దిశగా, ఆర్చర్‌ బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా స్టాండ్స్‌లోకి కొట్టిన వైనం, ఉనాద్కట్‌ ఓవర్లో డీప్‌ స్వే్కర్‌ లెగ్‌ వైపు బాదిన సిక్స్‌ ముచ్చటగొలిపాయి. చివరి ఓవర్లో పూర్తిగా క్రీజులోకి జరిగి బ్యాక్‌ఫుట్‌పై కొట్టిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి. 96 పరుగులతో 20 ఓవర్‌ చివరి బంతిని ఎదుర్కొన్న అతడు మరో భారీ షాట్‌తో సెంచరీ చేయడం ఖాయమనుకున్నా బంతి సరిగా కనెక్ట్‌ కాకపోవడంతో సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top