నాదల్‌ నిలిచాడు

Rafael Nadal reacts to marathon match win with pure class - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌

4 గంటల 49 నిమిషాల క్వార్టర్‌ ఫైనల్లో థీమ్‌పై విజయం

రాఫెల్‌ నాదల్‌ ్ఠ డొమినిక్‌ థీమ్‌మ్యాచ్‌ చూసిన వాళ్లకిది ఆటగాఅనిపించలేదంటే నమ్మాల్సిందే!ఆటగాళ్లు రాకెట్లతోనే పోరాడారంటేఅనుమానించాల్సిందే! ఇందులో విజేత ఒకరే అంటే తప్పనాల్సిందే! ఈ పోరాటంలో ఓడింది... చెమటే అంటే ఔనాల్సిందే!అవును. ఇది నిజం. ఆట కాదది యుద్ధం. అవి రాకెట్లు కాదు ఆయుధాలే.ఒకరు కాదు ఐదు గంటలాడిన ఇద్దరూ విజేతలే. థీమ్‌ పరాజిత కానేకాదు. పోరాడి ఓడినా కచ్చితంగా విజయుడే...థీమ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ చావే తప్పించుకున్నాడు... అంతే! కానీ కన్నులొట్టబోయింది. ఈ శ్రమైక సమరంలో చివరకు కొన ఊపిరితో బయటబట్టాడు నాదల్‌. ప్రత్యర్థి థీమ్‌ ఒక్క ఫలితంలోనే వెనుకబడ్డాడు. అరివీర పరాజయుడుగా నిలిచాడు. ఔరా... యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌. 

న్యూయార్క్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌ చేరాడు. డొమినిక్‌ థీమ్‌ చివరకు ఫలితంలో ఓడినా మనసుల్ని గెలిచాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌తో పాటు డెల్‌పొట్రో కూడా విజయం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెరెనా ట్రాక్‌లోకి వచ్చింది. సెమీస్‌లోకి అడుగు పెట్టిన ఆమె... అమ్మతనంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడేందుకు మరింత చేరువగా వచ్చింది.  

సరైనోడికి ‘సారీ’... 
స్పెయిన్‌ స్టార్, టాప్‌ సీడ్‌ నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అసాధారణ రికార్డు ఉంది. అందుకే సరిలేరు నీకెవ్వరని కీర్తిస్తాం. కానీ అలాంటి యోధుడికి ఈ యూఎస్‌ ఓపెన్‌లో సరైనోడు ఎదురుపడ్డాడు. ఎంతకీ తగ్గలేదు. ఎందాకైనా పోరాడాడు. ఓ దశలో ప్రేక్షకులకు ఈ మ్యాచ్‌ ముగించేది ఎవరనే అనుమానం వచ్చేసింది. చివరకు 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 0–6, 6–4, 7–5, 6–7 (4/7), 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై గెలిచాననిపించాడు. ఇక్కడ ఫలితం ప్రకారమైతే విజేత ఒక్కరే కానీ పోరాటాన్ని పరిశీలిస్తే కచ్చితంగా ఇద్దరనే అనిపిస్తుంది. మండే ఎండ సెగలకు హేమాహేమీలైన ఆటగాళ్లే బిత్తరపోతుంటే... వీళ్లిద్దరి హోరాహోరీకి ఆ సెగలే సలామ్‌ అన్నాయి. ఇద్దరు నాలుగేసి డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. కానీ ఆస్ట్రియన్‌ ఏస్‌లతో చెలరేగిపోయాడు. ఏకంగా 18 ఏస్‌లను సంధించగా, నాదల్‌ మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. స్పెయిన్‌ స్టార్‌ 55 విన్నర్లు కొడితే, థీమ్‌ 74 కొట్టాడు. ఇలా ఎందులోనూ తగ్గకుండా కడదాకా పోరాడాడు. దీంతో మొదటి సెట్‌లో నాదల్‌ ఒక్క గేమ్‌ కూడా గెలవలేకపోయాడు. కాస్త తేరుకొని రెండో సెట్‌ను, తర్వాత మూడో సెట్‌ను కష్టంగా గెలుచుకున్నాడు. ఇక మ్యాచ్‌ చేతుల్లోకి వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఆట కాస్తా ‘హాట్‌’అయింది. ప్రతీ పాయింట్‌ ఓ వేటయ్యింది. ఇద్దరి పోరాటం ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తర్వాతి రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి. ఈ టైబ్రేక్‌లు కూడా సమవుజ్జీలకు సమ న్యాయం చేశాయి. ఇద్దరూ చెరొకటి గెలిచారు. నాలుగో సెట్‌ను 7/6 (7/4)తో థీమ్‌ కైవసం చేసుకుంటే... నిర్ణాయక సెట్‌ను 7–6 (7/5)తో నాదల్‌ చేజిక్కించుకున్నాడు. అప్పటికే ఇద్దరు డ్రెస్‌పైనే చెమటస్నానం చేశారు. సరైనోడికి ‘సారీ’ చెబుతూ నాదల్‌ అతని వెన్నుతడితే... ప్రేక్షకుల చప్పట్ల మధ్య థీమ్‌ నిష్క్రమించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top