సింధు, సాయిప్రణీత్‌ శభారంభం | Sakshi
Sakshi News home page

సింధు, సాయిప్రణీత్‌ శభారంభం

Published Wed, Aug 23 2017 12:29 AM

సింధు, సాయిప్రణీత్‌  శభారంభం

ప్రిక్వార్టర్స్‌లోకి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ జంట
∙ జయరామ్‌ కూడా ముందంజ
∙ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌


ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బోణీ చేశారు. అంచనాలకు అనుగుణంగా రాణించి తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేశారు. భారత్‌కే చెందిన అజయ్‌ జయరామ్‌ కూడా తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

గ్లాస్గో (స్కాట్లాండ్‌): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్‌ సింగిల్స్‌ విభాగంలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో 21–16, 21–14తో కిమ్‌ హ్యో మిన్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కిమ్‌ హ్యో మిన్‌ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. గతంలో కిమ్‌పై మూడుసార్లు గెలిచిన సింధుకు ఈసారి అంతగా పోటీ ఎదురుకాలేదు. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 8–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కిమ్‌ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ సింధు తన జోరు కొనసాగించింది. ఆరంభంలోనే 8–3తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు బిగించింది. ఆ తర్వాత అదే దూకుడులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఎవెగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)–చెయింగ్‌ ఎన్గాన్‌ యి (హాంకాంగ్‌)ల మధ్య మ్యాచ్‌ విజేతతో సింధు మూడో రౌండ్‌లో తలపడుతుంది. సోమవారం ఆలస్యంగా జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రితూపర్ణ దాస్‌ 2–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి అనా మికెలా (ఫిన్‌లాండ్‌) గాయం కారణంగా వైదొలిగింది.  

పురుషుల సింగిల్స్‌లో 15వ సీడ్‌ సాయిప్రణీత్‌ 21–18, 21–17తో వీ నాన్‌ (హాంకాంగ్‌)పై, 13వ సీడ్‌ అజయ్‌ జయరామ్‌ 21–14, 21–12తో లుకా వ్రాబెర్‌ (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. వీ నాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన సాయిప్రణీత్‌ రెండో రౌండ్‌లో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో ఆడతాడు. ‘మ్యాచ్‌ కఠినంగా ఉంటుందని ముందే అంచనా వేశాను. వెనుకబడిన దశలో నా వ్యూహాన్ని మార్చాను. వీ నాన్‌ కొన్ని పొరపాట్లు చేయడంతో నేను వాటిని సద్వినియోగం చేసుకున్నాను’ అని సాయిప్రణీత్‌ వ్యాఖ్యానించాడు.  

డబుల్స్‌ విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 21–12, 21–19తో ప్రాజక్తా సావంత్‌ (భారత్‌)–యోగేంద్రన్‌ కృష్ణన్‌ (మలేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 17–21, 21–18, 5–21తో వాంగ్‌ యిలు–హువాంగ్‌ డింగ్‌పింగ్‌ (చైనా) ద్వయం చేతిలో... సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా (భారత్‌) జంట 20–22, 18–21తో క్రిస్టియాన్సన్‌–సారా థిగెసన్‌ (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓడిపోయాయి.మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్వని ద్వయం 21–15, 21–13తో రిరిన్‌ అమెలియా (ఇండోనేసియా)–చింగ్‌ చెయోంగ్‌ (మలేసియా) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి జోడీ 8–21, 12–21తో హిరోయుకి ఎండో–వతనాబె (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement
Advertisement