కొత్త జట్లతో మరింత ఆదరణ

PV Sindhu revelling in pressure ahead of Dubai Super Series Finals - Sakshi

పీబీఎల్‌పై పీవీ సింధు

అవధ్‌ టైటిల్‌ గెలుస్తుందన్న శ్రీకాంత్‌ 

దుబాయ్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో కొత్తగా మరో రెండు జట్లు అదనంగా రావడంతో ఆటకు మరింత ప్రచారం లభిస్తుందని భారత్‌ స్టార్‌ షట్లర్, రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు అభిప్రాయపడింది. గత రెండు సీజన్లలో లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, ఈసారి కూడా టోర్నీ మరింత ఆకర్షణీయంగా జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 14 వరకు భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తొలి రెండు సీజన్ల పాటు ఈ లీగ్‌లో ఆరు జట్లు ఉండగా, ఇప్పుడు అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్, నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌  జట్లు కూడా వచ్చాయి.

సింధు నాయకత్వంలోని చెన్నై స్మాషర్స్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ‘మేం టైటిల్‌ నిలబెట్టుకుంటామనే నమ్మకం ఉంది. ఈసారి స్మాషర్స్‌ అభిమానుల కోసం చెన్నైలో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. గత ఏడాది అక్కడ మేం ఆడలేకపోయాం. ఇప్పుడు అక్కడ కూడా ఆటపై ఆసక్తి పెరుగుతుంది. పైగా గువాహటిలాంటి చోటికి కూడా పీబీఎల్‌ వెళుతోంది. గతంలో ఏ స్థాయిలో కూడా అక్కడ ఆడని మాకు అదో కొత్త అనుభవం అవుతుంది. సహజంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరిగి చివరకు బ్యాడ్మింటన్‌కే మేలు చేస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది.   

ఒక్కడి ప్రదర్శన సరిపోదు...
పీబీఎల్‌ గత సీజన్‌లో తమ జట్టు బాగానే ఆడిందని, అయితే కీలక సమయంలో ఎదురైన పరాజయాలతో టోర్నీలో సెమీఫైనల్‌కే పరిమితమయ్యామని అవధ్‌  వారియర్స్‌ కెప్టెన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ అన్నాడు. ‘బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత ఆటే అయినా పీబీఎల్‌ వద్దకు వచ్చేసరికి అది టీమ్‌ గేమ్‌గా మారిపోయింది. నా ఒక్కడి ప్రదర్శనపైనే ఆధారపడి జట్టు ముందుకు వెళ్ళలేదు. ఈసారి జట్టు మరింత బలంగా ఉంది కాబట్టి తొలిసారి టైటిల్‌ను గెలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top