క్వార్టర్‌ ఫైనల్లో సింధు | pv sindhu enter quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సింధు

Apr 14 2017 12:41 AM | Updated on Sep 5 2017 8:41 AM

క్వార్టర్‌ ఫైనల్లో సింధు

క్వార్టర్‌ ఫైనల్లో సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

∙ శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా...
∙ సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీ


సింగపూర్‌ సిటీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా క్వార్టర్స్‌ పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తెలుగుతేజం సింధు చెమటోడ్చి నెగ్గింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె 19–21, 21–17, 21–8తో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియాని ఫిత్రియానిపై గెలిచింది. క్వార్టర్స్‌లో సింధు... కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో తలపడనుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 18–21, 21–19, 22–20తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)పై శ్రమించి నెగ్గాడు. భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా 21–15, 21–23, 21–16తో కియావో బిన్‌ (చైనా)పై చెమటోడ్చి గెలిచాడు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌... ఐదో సీడ్‌ షి యుకి (చైనా)తో, సాయిప్రణీత్‌... తనోంగ్సక్‌ సెన్సోంబున్సుక్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సుమీత్‌ రెడ్డి జోడి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 17–21, 21–17, 21–16తో జె హాన్‌ కిమ్‌– లి సో హి (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని ద్వయం 11–21, 21–19, 12–21తో టాప్‌ సీడ్‌ మిసాకి మత్సుతొమొ–అయక తకహషి (జపాన్‌) జోడి చేతిలో కంగుతింది.

ఐదుకు పడిపోయిన సింధు ర్యాంకు
న్యూఢిల్లీ: సింధు కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంకు వారం రోజుల ముచ్చటే అయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంకుకు పడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్‌ ర్యాంకుల్లో ఆమె మూడు స్థానాలు దిగజారింది. మలేసియా ఓపెన్‌లో 21 ఏళ్ల సింధు తొలి రౌండ్లోనే కంగుతినడంతో టాప్‌–2 ర్యాంకును కోల్పోయింది. సైనా కూడా అదే టోర్నీలో మొదటి రౌండ్లోనే ఓడినా... ఆమె తొమ్మిదో ర్యాంకు మాత్రం మారలేదు. పురుషుల సింగిల్స్‌ ర్యాంకుల్లో అజయ్‌ జయరామ్‌ 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మిగతావారెవరూ టాప్‌–20 జాబితాలో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement