సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు!

Pujara Breaks Sachins Record - Sakshi

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా శతకం సాధించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేస్తే, పుజారా 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన భారత్‌ ఆటగాళ్ల జాబితాలో పుజారా నాల్గో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌(195) తొలి స్థానంలో ఉండగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మురళీ విజయ్‌(144), సునీల్‌ గావస‍్కర్‌(132)లు ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని పుజారా ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో తొలి రోజు ఆటలో సచిన్‌ టెండూల్కర్‌(124) నమోదు చేసిన రికార్డును పుజారా అధిగమించాడు. కాగా, మళ్లీ సచిన్‌ తర్వాత స్థానంలో పుజారానే ఉండటం ఇక్కడ మరో విశేషం. ఇదే సిరీస్‌ తొలి టెస్టులో పుజారా 123 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ పరుగులు కూడా తొలి రోజు ఆటలోనే పుజారా సాధించాడు.

ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు.  అంతకముందు ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌( 2003-04 సీజన్‌లో 1203 బంతులు), విజయ్‌ హజారే(1947-48 సీజన్‌లో 1192 బంతులు), కోహ్లి(2014-15 సీజన్‌లో 1093 బంతులు)సునీల్‌ గావస్కర్‌(1977-78 సీజన్‌లో 1032 బంతులు) వరుస స్థానాల్లో ఉన్నారు.  ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్‌ గావస్కర్‌ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top