నాలుగు రోజుల టెస్టు...  రెండు రోజుల్లోపే  | Proteas thrash Zimbabwe inside 2 days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల టెస్టు...  రెండు రోజుల్లోపే 

Dec 28 2017 12:31 AM | Updated on Dec 28 2017 12:31 AM

Proteas thrash Zimbabwe inside 2 days - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌... ప్రయోగాత్మకంగా నాలుగు రోజుల పాటు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, ఆటకు ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందా...ఐసీసీకి వచ్చిన ఆలోచన ఇది! అనుకున్నదే తడవుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ టెస్టుకు రంగం సిద్ధమైపోయింది. అయితే కొండలాంటి దక్షిణాఫ్రికా ముందు బలహీన జింబాబ్వే తేలిపోయింది. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ కాస్తా రెండు రోజులు కూడా పూర్తిగా సాగకుండా ఫలితం వచ్చేసింది. సఫారీ జోరుకు తలవంచిన జింబాబ్వే బుధవారం ముగిసిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్, 120 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ ఫలితం టెస్టుల విలువను పెంచుతుందా లేక దానిని ఇంకా దిగజార్చుతుందా అనేది ఇప్పుడు కొత్త ప్రశ్న? 

ఓవర్‌నైట్‌ స్కోరు 30/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మోర్నీ మోర్కెల్‌ (5/21) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పని పట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా, జింబాబ్వేను ఫాలోఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తీరు మారని జింబాబ్వే 42.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఇర్విన్‌ (23) టాప్‌ స్కోరర్‌ కాగా...కేశవ్‌ మహరాజ్‌ (5/59) ఈ సారి జింబాబ్వేను దెబ్బ తీశాడు. రెండో రోజు టీ విరామానికి 15 నిమిషాల ముందే మ్యాచ్‌ ముగిసిపోయింది. మొత్తం ఐదు సెషన్లు కూడా సాగని ఈ మ్యాచ్‌లో జింబాబ్వేను రెండు సార్లు ఆలౌట్‌ చేసేందుకు సఫారీలకు 72.4 ఓవర్లు మాత్రమే సరిపోవడం ఆ జట్టుకు కొత్త రికార్డు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మర్‌క్రమ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement