
వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. రెండో రోజు ఆటలోనూ పర్యాటక జట్టుపై భారత్ ఆధిపత్యం చెలాయించింది. 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న యశస్వి జైశ్వాల్ అనుహ్యంగా రనౌటై తన వికెట్‌ను కోల్పోయాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, ధ్రువ్ జురెల్ కెప్టెన్ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్‌మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
భారత్ సరికొత్త రికార్డు..
అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. గత 65 ఏళ్లలో వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఐదు వికెట్లకు వరుసగా 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది.
టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్‌నర్‌షిప్స్ నెలకొల్పారు. తొలి వికెట్‌కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్‌కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్‌కు జైస్వాల్-శుభ్‌మన్ గిల్ 69, నాలుగో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు భారత్
1960లో గబ్బా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన అరుదైన టై టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్‌నర్‌షిప్స్‌ను నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు భారత్ ఈ ఫీట్ సాధించింది.
మూడో సారి..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఈ ఘనతను సాధించడం ఇది మూడోసారి. 1993లో ముంబైలో ఇంగ్లండ్, 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. కానీ విండీస్‌పై మాత్రం ఇదే తొలిసారి.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా