సమాజ సేవే లక్ష్యం కావాలి
రామదాసి ఆత్మరాం సురేశ్ శర్మ మహారాజ్
ఒకే నామధ్యేయంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
విద్యానగర్(కరీంనగర్): కలియుగ దైవం శ్రీనివాసుడి నామ థ్యేయంతో ఒకటైన శ్రీనివాసులందరిది సమాజ సేవే లక్ష్యం కావాలని చిలుకూరు బాలాజీ శ్రీసుందరేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, ధర్మసంస్ధాపన అధ్యక్షులు రామదాసి ఆత్మరాం సురేశ్‌శర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని పీవీఆర్ ప్లాజాలో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడిపై భక్తి విశ్వాసాలను పెంచుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని ఆయన భక్తులు.. తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకుని వారిలో ఆ దేవదేవుడిని నిత్యం దర్శిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసులందరూ దైవకార్యాలతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వూట్కూరు శ్రీనివాస్ రెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ నామధ్యేయులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో శ్రీనివాసులు రక్తదానం చేశారు.

వాట్సాప్ గ్రూపుతో ముందుకు..
తొలిసారిగా 2023 అక్టోబర్ 29న మనమంతా శ్రీనివాసులమే పేరుతో వుట్కూరి శ్రీనివాస్‌రెడ్డి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య 23వేలకు చేరింది. గతేడాది అక్టోబర్ 27న కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో తొలి వార్షికోత్సవం నిర్వహించగా.. 760 మంది హాజరయ్యారు. ద్వితీయ వార్షికోత్సవానికి శ్రీనివాసులు పెద్ద ఎత్తున హాజరుకావడంతోపాటు వండర్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు.

ఏకనామం సదాప్రీతి
ఏకనామం.. సదా ప్రీతి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఒకే భావజాలంతో శ్రీవారి సేవకు అంకితమవుతాం. ఇప్పటికే 23వేల మంది సభ్యుల ఐక్యత, భక్తి తత్పరత ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఆ శ్రీనివాసుని చల్లని దీవెనలు అన్నివే«ళలా అందరిపై ఉండాలని కోరుకుంటాను. – నంది శ్రీనివాస్, అధ్యక్షులు సాహితీ గౌతమి, కరీంనగర్

పూర్వ జన్మ సుకృతం
పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు ఈ జన్మలో మా తల్లిదండ్రులు ఏడుకొండల వాడి పేరు మాకు పెట్టారు. ఆ పేరు సార్థకం చేసుకుంటూ.. సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నాం. శ్రీనివాస్ పేరు ఉన్నవారందరం ఒక చోట, ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – గాండ్ల శ్రీనివాస్, న్యాయవాది, శ్రీనివాసుల సేవా సంస్థ లీగల్ ఆడ్వైజర్, కరీంనగర్

ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది
లక్ష్మీనివాసుడైన శ్రీనివాసుడి పేరు మాకు ఉండడం అదృష్టం. ఇంత మంది శ్రీనివాసులు ఒకే వేదిక మీద కలువడం అద్భుతంగా ఉంది. శ్రీనివాస్ పేరు తలిస్తేనే అధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అలాంటి మహాత్మ్యం మరో పేరులో లేదు. అలాంటి పేరు మాకు ఉండడం చాలా సంతోషంగా ఉంది. -కన్నోజు శ్రీనివాస్, ఇనుగుర్తి శ్రీనివాస్, జగిత్యాల

పేరు ప్రాధాన్యం తెలపడానికి
ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరికి శ్రీనివాస్ పేరు పెట్టేవారు. ప్రస్తుతం కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ పేరు ప్రాధాన్యాన్ని నేటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనమంతా శ్రీనివాసులం అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ పేరున్న అందరినీ ఒకటి చేస్తున్నా. – వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్ధ అధ్యక్షులు

కలియుగ దైవం పేరు
కలియుగ దైవం శ్రీనివాసుడంటే అందరికీ భక్తి, నమ్మకం. అ నమ్మకంతోనే మా తల్లిదండ్రులు ఆయన పేరును మాకు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆయన ఆశీస్సులు ఉంటే అంతామంచి జరుగుతుందనే నమ్మకం. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరి విశ్వాసం, ఆయన పేరు మాకు ఉండడం మా అదృష్టం. – పల్లెర్ల శ్రీనివాస్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి,కరీంనగర్

మాది పేరు బంధం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీని వాసుడు. ఆయన పేరును కు టుంబసభ్యులు మాకు పెట్ట డం అదృష్టంగా భావిస్తాను. శ్రీనివాసులందరిదీ దైవబంధం. ఆ శ్రీనివాసుడు ఏమీ ఆశించకుండా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదే విధంగా మేమందరం కూడా సామాజిక సేవలో నడువాలన్నదే ధ్యేయం. – ఎలగందుల శ్రీనివాస్, వాసుదేవ హాస్పిటల్, కరీంనగర్


