పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు... | Pro Kabaddi season 4 Final: Patna Pirates lift trophy for second time, beat Jaipur Pink Panthers 37-29 | Sakshi
Sakshi News home page

పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు...

Aug 1 2016 1:59 AM | Updated on Sep 4 2017 7:13 AM

పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు...

పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు...

ప్రొ కబడ్డీలో వరుసగా రెండో ఏడాది బిహారీ జట్టు హవా కొనసాగింది. సీజన్-4లో ఆది నుంచి తొడగొట్టి ఆధిక్యం ప్రదర్శించిన

ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా 
వరుసగా రెండోసారి టైటిల్ సొంతం
ఫైనల్లో జైపూర్ చిత్తు టైటాన్స్
నాలుగో స్థానంతో సరి


హైదరాబాద్: ప్రొ కబడ్డీలో వరుసగా రెండో ఏడాది బిహారీ జట్టు హవా కొనసాగింది. సీజన్-4లో ఆది నుంచి తొడగొట్టి ఆధిక్యం ప్రదర్శించిన పట్నా పైరేట్స్ లీగ్ చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. రెండోసారి టైటిల్ చేజిక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పైరేట్స్ 37-29 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తు చేసింది. గత సీజన్‌లో విజేతగా నిలిచిన పట్నా డిఫెండింగ్ చాంపియన్‌గా తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చింది. అద్భుత ప్రదర్శన చేసిన పర్‌దీప్ నర్వాల్ 16 రైడింగ్ పాయింట్లతో పట్నా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాంథర్స్ తరఫున కెప్టెన్ జస్వీర్ (13 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. విజేతగా నిలిచిన పైరేట్స్‌కు రూ. 1 కోటి, రన్నరప్ జైపూర్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్ వరకు దూసుకొచ్చిన తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ చేతిలో 35-40తో ఓడి నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది.

 
పర్‌దీప్ జోరు...

ఫైనల్ ఆరంభం నుంచి పైరేట్స్ ముందంజలో నిలిచింది. సీజన్ ఆసాంతం పైరేట్స్ తరఫున చెలరేగిన పర్‌దీప్ నర్వాల్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు ప్రదర్శిస్తూ కీలక సమయాల్లో పాయింట్లు రాబట్టాడు. డిఫెన్స్‌లో హాది రాణించడంతో జైపూర్‌కు పట్టు చిక్కలేదు. అయితే జస్వీర్ మెరుగైన రైడింగ్‌తో ఆ జట్టు కోలుకుంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పైరేట్స్ 19-16తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో జైపూర్ డిఫెన్స్ పూర్తిగా విఫలం కాగా... పట్నా తమ ఆధిక్యం కోల్పోకుండా జాగ్రత్త పడింది. హాది రెండుసార్లు సూపర్ టాకిల్‌తో జైపూర్ పని పట్టాడు. 33వ నిమిషంలో 31-22తో ముందుకు దూసుకుపోయిన పైరేట్స్‌కు ఆ తర్వాత పాంథర్స్ పోటీ ఇవ్వలేకపోయింది. జస్వీర్ కూడా చివర్లో వరుస రైడ్‌లలో విఫలం కావడంతో పైరేట్స్ రెండోసారి టైటిల్‌ను ఖాయం చేసుకుంది.


మరోసారి తడబడ్డారు...
సొంతగడ్డపై ప్లే ఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించి మూడో స్థానంలో నిలవాలనుకున్న తెలుగు టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. హోరాహోరీగా సాగిన పోరులో చివరి క్షణాల్లో టైటాన్స్ పట్టు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రాహుల్ చౌదరి (18 రైడింగ్ పాయింట్లు) మరోసారి వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన పుణేరీ 10-3తో దూసుకుపోయింది. అయితే రాహుల్ వరుస పాయింట్లు రాబట్టడంతో జట్టు కోలుకుంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పల్టన్ 17-14తో ముందంజలో నిలిచింది. ఆ వెంటనే పుణేను టైటాన్స్ ఆలౌట్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఆధిపత్యం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. ఒక దశలో 30-34తో వెనుకబడిన టైటాన్స్ రాహుల్ చలవతో 35-36తో ప్రత్యర్థి స్కోరుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో రైడింగ్ వెళ్లిన దీపక్ హుడా ఒకే సారి రాహుల్, విశాల్, రూపేశ్‌లను అవుట్ చేయడంతో 39-35తో ముందుకెళ్లిన పల్టన్, మరో పాయింట్‌ను సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పుణే ఆటగాళ్లలో దీపక్ హుడా 17 పాయింట్లు సాధించడం విశేషం.

 

500 ప్రొ కబడ్డీ లీగ్‌లో నాలుగు సీజన్లు కలిపి మొత్తం 500 రైడింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్ చౌదరి నిలిచాడు.

 

విజేత: పట్నా పైరేట్స్... రూ. కోటి
రన్నరప్: జైపూర్ పింక్‌పాంథర్స్... రూ. 50 లక్షలు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు:  పర్‌దీప్ నర్వాల్ (పట్నా) రూ. 10 లక్షలు
డిఫెండర్ ఆఫ్ ది టోర్నీ: ఫజల్ అత్రాచల్ (పట్నా) రూ. 5 లక్షలు
రైడర్ ఆఫ్ ది టోర్నీ: రాహుల్ చౌదరి  (టైటాన్స్) రూ. 5 లక్షలు
రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీ: అజయ్ కుమార్ (జైపూర్) రూ. 1 లక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement