
న్యూఢిల్లీ: ఒకవేళ టోక్యో ఒలింపిక్స్ రద్దు అయితే నాలుగేళ్ల తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆటగాళ్లంతా ఒలింపిక్స్ వాయిదా వేయాలని పట్టుబడుతుంటే ఈ మణిపురి లిఫ్టర్ మాత్రం సకాలంలో ఈ మెగా ఈవెంట్ జరగాలని కోరుకుంటోంది. ‘ఒలింపిక్స్ రద్దవుతే మా శ్రమంతా వృథా అవుతుంది. ఒలింపిక్స్ పతకం కోసం నాలుగేళ్లుగా శ్రమిస్తున్నా. నేను ఇది కోరుకోవట్లేదు. రోజూ దేవున్ని దీని గురించే ప్రార్థిస్తున్నా. ఒక వేళ ఇవి వాయిదా పడినా ఇబ్బందే. ప్రాక్టీస్‌లో తీవ్రత తగ్గిపోతుంది.
ఇది పతక అవకాశాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి సకాలంలో ఒలింపిక్స్ జరిగితే బావుంటుంది’ అని ఇప్పటికే ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న చాను తెలిపింది. కరోనా కారణంగా వెయిట్ లిఫ్టర్లు ప్రాక్టీస్ చేసే పాటియాలా జాతీయ ట్రెయినింగ్ సెంటర్ కూడా మూసేస్తారని తొలుత భయపడినట్లు ఆమె చెప్పింది. అయితే కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను మినహాయించి మిగతా క్రీడాకారుల్ని ఇళ్లకు పంపించివేశారని తెలిపింది. ‘అకాడమీ కూడా లిఫ్టర్లు లేక వెలవెలబోతుంది. కేవలం ఒలింపిక్స్ ఆశావహులు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా పంపిస్తారని ముందుగా భయపడ్డా. కానీ అలాంటిదేమీ లేదు. తగిన ఆరోగ్య భద్రతలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాం’ అని చాను వివరించింది.