
నేటి నుంచి కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్
అహ్మదాబాద్: ఏడాది విరామం తర్వాత భారత స్టార్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను పోటీల బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఇక్కడ జరిగే కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్టార్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం ఒక కిలోగ్రామ్ తేడాతో పోడియంలో నిలువలేకపోయిన మీరాబాయి తర్వాత గాయాల బారిన పడింది. దీంతో చాలా టోర్నీలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పతకం పట్టుపట్టేందుకు 32 ఏళ్ల మీరా 48 కేజీల కేటగిరీకి మారింది.
లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో ఆమె రెగ్యులర్ కేటగిరీ కాకుండా 48 కేజీల కేటగిరీ ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఈ తాజా చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో మీరాబాయి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు కామన్వెల్త్ క్రీడల రజత విజేత బింద్యారాణి దేవి, కాంస్య విజేతలు హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్‌లు సహా భారత లిఫ్టర్లే ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.
భారత జట్ల వివరాలు:
మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), స్నేహా సోరెన్ (53 కేజీలు), బింద్యారాణి (58 కేజీలు), నిరుపమా (63 కేజీలు), హర్జిందర్ కౌర్ (69 కేజీలు), హర్మన్‌ప్రీత్ కౌర్ (77 కేజీలు), వన్షిత (86 కేజీలు), మెహక్ (+86 కేజీలు). పురుషులు: రిషికాంత సింగ్ (60 కేజీలు),
ఎం.రాజా (65 కేజీలు), నారాయణ అజిత్ (71 కేజీలు), వల్లూరి అజయ్ బాబు (79 కేజీలు), అజయ్ సింగ్ (88 కేజీలు), దిల్బాగ్ సింగ్ (94 కేజీలు), హర్‌చరణ్ సింగ్ (110 కేజీలు), లవ్‌ప్రీత్ సింగ్ (+110 కేజీలు).