
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి చానుకు స్వర్ణం
అహ్మదాబాద్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి ఈవెంట్‌లోనే భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మెరిసింది. సోమవారం మొదలైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 31 ఏళ్ల మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి మొత్తం 193 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది.
స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... ఈ క్రమంలో కొత్త కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డులు నెలకొల్పింది. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మీరాబాయి ముందుగా స్నాచ్ తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన ఈ మణిపూర్ లిఫ్టర్... మూడో ప్రయత్నంలో 89 కేజీలు ఎత్తబోయి విఫలమైంది.
క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 105 కేజీలు, రెండో ప్రయత్నంలో 109 కేజీలు ఎత్తిన మీరాబాయి... మూడోసారి 113 కేజీలు ప్రయతి్నంచి విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో 49 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన మీరాబాయి... గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అన్ని వెయిట్ కేటగిరీలను సవరించింది. ఇందులో భాగంగా 49 కేజీల విభాగాన్ని తొలగించి 48 కేజీల విభాగాన్ని మళ్లీ తెచ్చారు. గతంలో మీరాబాయి 48 కేజీల విభాగంలో 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో.. 2013, 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించింది.
రిషికాంతకు బంగారు పతకం
కామన్వెల్త్ చాంపియన్‌షిప్ తొలి రోజు రిషికాంత సింగ్ ప్రదర్శనతో భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది. పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత మొత్తం 271 కేజీలు (స్నాచ్‌లో 120 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 151 కేజీలు) బరువెత్తి మొదటి స్థానంలో నిలిచాడు.