breaking news
Indian Weightlifting
-
‘పసిడి’తో పునరాగమనం
అహ్మదాబాద్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి ఈవెంట్లోనే భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మెరిసింది. సోమవారం మొదలైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 31 ఏళ్ల మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి మొత్తం 193 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... ఈ క్రమంలో కొత్త కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డులు నెలకొల్పింది. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మీరాబాయి ముందుగా స్నాచ్ తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన ఈ మణిపూర్ లిఫ్టర్... మూడో ప్రయత్నంలో 89 కేజీలు ఎత్తబోయి విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 105 కేజీలు, రెండో ప్రయత్నంలో 109 కేజీలు ఎత్తిన మీరాబాయి... మూడోసారి 113 కేజీలు ప్రయతి్నంచి విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో 49 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన మీరాబాయి... గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అన్ని వెయిట్ కేటగిరీలను సవరించింది. ఇందులో భాగంగా 49 కేజీల విభాగాన్ని తొలగించి 48 కేజీల విభాగాన్ని మళ్లీ తెచ్చారు. గతంలో మీరాబాయి 48 కేజీల విభాగంలో 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో.. 2013, 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించింది. రిషికాంతకు బంగారు పతకం కామన్వెల్త్ చాంపియన్‌షిప్ తొలి రోజు రిషికాంత సింగ్ ప్రదర్శనతో భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది. పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత మొత్తం 271 కేజీలు (స్నాచ్‌లో 120 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 151 కేజీలు) బరువెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. -
‘చైనా బరువు’ మాకొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మన దేశంలో అన్ని వైపుల నుంచి పిలుపు వస్తోంది. ఈ నేపథ్యంలో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) ఒక అడుగు ముందుకు వేసింది. చైనా తయారు చేసిన వెయిట్‌లిఫ్టింగ్ సెట్లను తాము ఇకపై వాడబోమని ప్రకటించింది. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్లతో కూడిన నాలుగు సెట్లను గతంలో ‘జెడ్కేసీ’ అనే చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చి సమాఖ్య తెప్పించింది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఐడబ్ల్యూఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ లేఖ రాశారు. ‘చైనా ఎక్విప్మెంట్ను మనం నిషేధించాల్సిందే. మున్ముందు కూడా ఆ దేశపు వస్తువులు ఏవీ వాడరాదని సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. భవిష్యత్తులో భారత కంపెనీలు గానీ లేదా ఇతర దేశాల కంపెనీలు తయారు చేసిన ఎక్విప్మెంట్లు వాడతాం కానీ చైనా వస్తువులు మాత్రం ముట్టం’ అని యాదవ్ స్పష్టం చేశారు. నాసిరకంగా ఉన్నాయి... మరోవైపు నిషేధాన్ని సమర్థిస్తూనే భారత వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ మరో కారణాన్ని కూడా చూపారు. ఎక్విప్మెంట్ నాసిరకంగా ఉండటం వల్లే పక్కన పడేస్తున్నామని ఆయన వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్స్‌నే వాడతారు కాబట్టి మరో ప్రత్యామ్నాయం లేక సన్నాహాల కోసం తాము గతంలో వాటికి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పుడు ఇతర కంపెనీల ఎక్విప్మెంట్కు అలవాటు పడతామని కోచ్ చెప్పారు. ‘లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత లిఫ్టర్లు వాటిని వాడే ప్రయత్నం చేస్తే అవి ఏమాత్రం బాగా లేవని అర్థమైంది. దాంతో మూలన పడేశాం. మా లిఫ్టర్లంతా కూడా చైనా తయారీ వస్తువులను వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం స్వీడిష్ కంపెనీ ‘ఎలికో’కు చెందిన ఎక్విప్మెంట్తో సాధనకు సిద్ధమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ టోర్నీలు ‘ఎలికో’తోనే నిర్వహిస్తారు. భారతీయ తయారీదారులతో సహా ప్రస్తుతం ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు చైనా ఉత్పత్తులు అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. -
గాయం కారణంగానే రాహుల్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: గాయం కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ (85 కేజీలు) పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి తొలగించినట్లు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) తెలిపింది. అతనితో పాటు సతీశ్ శివలింగం (77 కేజీలు) గాయాలతో బాధపడుతుండటంతో వారి పేర్లను ఈ జాబితా నుంచి తప్పించినట్లు పేర్కొంది. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిద్దరు గాయాల నుంచి కోలుకొని తిరిగి ‘టాప్’లో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నా’ అని ఐడబ్ల్యూఎల్ఎఫ్ కార్యదర్శి సహదేవ్ తెలిపారు. ఈ ఇద్దరితో పాటు పూనమ్ యాదవ్‌ను కూడా ఈ జాబితా నుంచి తొలిగించారు. ఆమె చెప్పాపెట్టకుండా జాతీయ శిబిరం నుంచి గైర్హాజరు అయిన నేపథ్యంలో ఆమె పేరు తొలగించారు. ఈ ముగ్గురి స్థానంలో కొత్తగా మరో ముగ్గురికి చోటు కల్పించారు. సంజిత చాను (53 కేజీలు), పర్దీప్ సింగ్ (105 కేజీలు), రాఖీ (63 కేజీలు)లను ఈ జాబితాలో చేర్చారు. -
21 మంది లిఫ్టర్లపై వేటు
న్యూఢిల్లీ : డోపింగ్ పరీక్షలో విఫలమైన 21 మంది భారత వెయిట్‌లిఫ్టర్లపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించారు. జనవరిలో జరిగిన జాతీయ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఎక్కువ మంది దొరికినట్టు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య తెలిపింది. ‘21 మంది లిఫ్టర్లు డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. వారి ‘బి’ శాంపిల్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘటనగా చెబుతున్నా యూనివర్శిటీ, పోలీస్ గేమ్స్, రైల్వేస్ ఇలాంటి పోటీల్లోనూ కొందరు పట్టుబడిన విషయం గుర్తుంచుకోవాలి. సదరు ఆటగాళ్ల ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే తొలిసారి శిక్ష కింద నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐడబ్ల్యుఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌లపై కూడా నిషేధంతో పాటు జరిమానా విధించారు.