
చెన్నై: భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సమయంలోనే ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో విషాదం నెలకొంది. అతని తండ్రి ఎస్.జి.ప్రభాకరన్ అనారోగ్య సమస్యలతో శనివారం తుదిశ్వాస విడిచారు. స్థిరాస్తి వ్యాపారి అయిన ప్రభాకరన్ గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నైలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శనివారం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతిచెందారని ప్రజ్నేశ్ సన్నిహితులు వెల్లడించారు. తండ్రి తుదిశ్వాస విడిచే సమయంలో అతను అక్కడే ఉన్నాడు. 29 ఏళ్ల ప్రజ్నేశ్‌కు ఈ నెల 28న కొచ్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లితంతు ఏమవుతుందో తెలీదుకానీ... సోమవారం మొదలయ్యే పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో అతను పాల్గొంటాడని కుటుంబసభ్యులు తెలిపారు.