అయ్యో అఫ్గాన్‌!

Pakistan Won By 3 Wickets Against Afghanistan - Sakshi

గెలుపు అంచుల దాకా రావడం వేరు... మ్యాచ్‌ గెలవడం వేరు... అఫ్గానిస్తాన్‌ జట్టుకు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా అర్థమై ఉంటుంది. ఈ కప్‌లో భారత్‌ను గడగడలాడించిన ఆ టీమ్‌ శనివారం పాకిస్తాన్‌ను దాదాపు ఓడించే స్థితిలో నిలిచింది. కానీ మరోసారి ఆ జట్టు అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంది...పేలవ ఫీల్డింగ్‌కు తోడు కెప్టెన్‌ గుల్‌బదిన్‌ నైబ్‌ చెత్త నాయకత్వం అఫ్గన్‌కు వరుసగా ఎనిమిదో పరాజయాన్ని మిగిల్చాయి. మరో వైపు ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్‌ అవకాశాలు దాదాపుగా కోల్పోయే పరిస్థితిలో నిలిచిన పాక్‌ ఎట్టకేలకు గట్టెక్కింది. బౌలింగ్‌లో షాహిన్‌ అఫ్రిది సత్తా చాటి ప్రత్యర్థిని కట్టడి చేయగా... తీవ్ర ఒత్తిడిలో ఇమాద్‌ వసీమ్‌ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు.  

లీడ్స్‌: 228 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన పాక్‌ ఒక దశలో 45 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. 5 ఓవర్లలో 46 పరుగులు అంటే 9కి పైగా రన్‌రేట్‌తో కష్టసాధ్యమైన పరిస్థితి! కానీ అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ప్రత్యర్థికి అందించాడు. ప్రధాన స్పిన్నర్లు రషీద్, ముజీబ్‌లకు కలిపి 3 ఓవర్లు, అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన లెగ్‌స్పిన్నర్‌ షిన్వారికి మరో 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

పాక్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దశలో వీరి బౌలింగ్‌ అఫ్గాన్‌కు అరుదైన విజయాన్ని అందించేదే. కానీ అప్పటికే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన నైబ్‌ అత్యుత్సాహంతో బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ ఓవర్లో చెలరేగిన ఇమాద్‌ మూడు ఫోర్లు సహా ఏకంగా 18 పరుగులు రాబట్టి పాక్‌ పని సులువు చేశాడు. ఒక్కసారిగా 18 బంతుల్లో 28 పరుగులకు సమీకరణం మారిపోగా, 16 బంతుల్లోనే పాక్‌ పని పూర్తి చేసింది.  

శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా తమ సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అస్గర్‌ అఫ్గాన్‌ (35 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్‌ (54 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

షాహిన్‌ అఫ్రిది 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇమాద్‌ వసీం (54 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా... బాబర్‌ ఆజమ్‌ (51 బంతుల్లో 45; 5 ఫోర్లు), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (36) రాణించారు.   

స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌ : రహ్మత్‌ షా (సి) బాబర్‌ (బి) ఇమాద్‌ 35; గుల్బదిన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాహిన్‌ 15; హష్మతుల్లా (సి) ఇమాద్‌ (బి) షాహిన్‌ 0; ఇక్రామ్‌ (సి) హఫీజ్‌ (బి) ఇమాద్‌ 24; అస్గర్‌ (బి) షాదాబ్‌ 42; నబీ (సి) ఆమిర్‌ (బి) రియాజ్‌ 16; నజీబుల్లా (బి) షాహిన్‌ 42; షిన్వారి (నాటౌట్‌) 19; రషీద్‌ (సి) ఫఖర్‌  (బి) షాహిన్‌ 8; హమీద్‌ (బి) వహాబ్‌  1; ముజీబ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227.  

వికెట్ల పతనం: 1–27, 2–27, 3–57, 4–121, 5–125, 6–167, 7–202, 8–210, 9–219.  

బౌలింగ్‌: ఇమాద్‌ 10–0–48–2, ఆమిర్‌ 10–1–41–0, షాహిన్‌ 10–0–47–4, హఫీజ్‌ 2–0–10–0, వహాబ్‌ 8–0–29–2, షాదాబ్‌ 10–0–44–1.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫఖర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ముజీబ్‌ 0; ఇమామ్‌ (స్టంప్డ్‌) ఇక్రామ్‌ (బి) నబీ 36; బాబర్‌ ఆజమ్‌ (బి) నబీ 45; హఫీజ్‌ (సి) హష్మతుల్లా (బి) ముజీబ్‌ 19;  హారిస్‌ సొహైల్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్‌ 27; సర్ఫరాజ్‌ రనౌట్‌ 18; ఇమాద్‌ (నాటౌట్‌) 49; షాదాబ్‌ రనౌట్‌ 11; వహాబ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (49.4 ఓవర్లలో 7 వికెట్లకు)230.

వికెట్ల పతనం: 1–0, 2–72, 3–81, 4–121, 5–142, 6–156, 7–206.

బౌలింగ్‌: ముజీబ్‌ 10–1–34–2, హమీద్‌ 2–0–13–0, నైబ్‌ 9.4–0–73–0, నబీ 10–0–23–2, రషీద్‌ 10–0–50–1, షిన్వారీ 8–0–32–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top