
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. అతని దేశం తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి స్పిన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. యూఏఈ ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి పాక్‌కు టైటిల్‌ను అందించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో నవాజ్‌కి ముందు 73 మంది హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. పాక్ తరఫున నవాజ్‌ది మూడో హ్యాట్రిక్. నవాజ్‌కు ముందు పాక్ తరఫున హ్యాట్రిక్‌లు సాధించిన వారిద్దరు (ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ హస్నైన్) పేస్ బౌలర్లే.
మ్యాచ్ విషయానికొస్తే.. నవాజ్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో పాక్ ఆఫ్ఘనిస్తాన్‌పై 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్‌ఫర్ ఓ వికెట్ తీసి పాక్‌ను కట్టడి చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆదిలోనే ఓటమి ఖాయం చేసుకుంది. పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు.
రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
నవాజ్ 6వ ఓవర్ చివరి రెండు బంతులకు, 8వ ఓవర్ తొలి బంతికి వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. 8వ ఓవర్‌లో నవాజ్ మరో వికెట్ కూడా తీశాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది.