పాక్‌ ఇన్నింగ్స్‌ విజయం 

Pakistan v New Zealand: Yasir Shah takes 14 wickets in innings win for Pakistan - Sakshi

రెండో టెస్టులో కివీస్‌పై గెలుపు

14 వికెట్లు తీసిన యాసిర్‌ షా  

దుబాయ్‌: తొలి టెస్టులో న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న పాకిస్తాన్‌ రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇన్నింగ్స్‌ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌ షా (6/143) కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మంగళవారం నాలుగో రోజు ఫాలోఆన్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 131/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ (82; 7 ఫోర్లు, 1 సిక్స్‌), లాథమ్‌ (50; 4 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక లాథమ్‌ నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన నికోల్స్‌ అండతో ఇన్నింగ్స్‌ను నడిపించిన టేలర్‌ జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఓ వైపు నికోల్స్‌ (77; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడుతున్నప్పటికీ ఇతర బ్యాట్స్‌మెన్‌ను యాసిర్‌ షా తన స్పిన్‌ మాయాజాలంతో పడేశాడు. దీంతో టి విరామం తర్వాత కొద్దిసేపటికే కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. మ్యాచ్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టిన యాసిర్‌ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. చివరి టెస్టు వచ్చే నెల 3 నుంచి అబుదాబిలో జరుగుతుంది.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top