
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 64 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ కోల్పోయి ఛేదించింది. హారిస్ సోహైల్ (39 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. గత పర్యటన (2016)లో కూడా పాకిస్తాన్ లార్డ్స్ టెస్టులో విజయం సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 235/6తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్... మరో ఏడు పరుగులు మాత్రమే చేసి 242 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (67) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు, బెస్ (57) రెండు పరుగులు చేసి వెనుదిరిగారు. పాక్ బౌలర్లలో అమీర్, అబ్బాస్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అబ్బాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 1 నుంచి లీడ్స్‌లో ప్రారంభం కానుంది.