ఏప్రిల్‌ 15 వరకు ఆటల్లేవ్‌!  | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 15 వరకు ఆటల్లేవ్‌! 

Published Fri, Mar 20 2020 2:08 AM

No Sports Competitions Until April 15th Says Sports Minister Rijiju - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కోవిడ్‌–19) వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా జాతీయ స్పోర్ట్స్‌ సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌) క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్‌ 15 వరకు దేశంలో ఎటువంటి టోర్నమెంట్‌లను, సెలెక్షన్‌ ట్రయల్స్‌ను నిర్వహించరాదని స్పష్టం చేసింది. దాంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు ఒలింపిక్స్‌ సన్నాహక క్యాంపుల్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమయ్యేలా చూడాల్సిన భాద్యతను ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అప్పగించింది. వారిని క్యాంపుతో సంబంధం లేని కోచ్‌లు గానీ, ఏ ఇతర సిబ్బంది గానీ కలవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధం అవుతున్న క్రీడాకారులు మాత్రమే ప్రస్తుతం శిక్షణ శిబిరాల్లో ఉన్నారు.’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో టోర్నమెంట్‌లు ముగించుకుని దేశానికి వస్తున్న అథ్లెట్లపై నిఘా ఉంచామని రిజిజు అన్నారు. వారు దేశంలో అడుగుపెట్టిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

15 తర్వాతే ఐపీఎల్‌పై నిర్ణయం 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రిజిజు... ఏప్రిల్‌ 15 తర్వాతే ఐపీఎల్‌పై స్పష్టమైన నిర్ణయం రావచ్చన్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌ అనేది బీసీసీఐ చేతుల్లో ఉందని... అది ఒలింపిక్‌ క్రీడ కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో తాము ఆటగాళ్ల, ప్రేక్షకుల ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

Advertisement
Advertisement