‘ఆ రిపోర్ట్‌పైనే షమీ భవితవ్యం’

No Decision On Shamis IPL Participation Till Anti Corruption Unit Files Report, CK Khanna - Sakshi

ముంబై:ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన మహ్మద్‌ షమీ క్రికెట్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.  తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉండవచ్చని భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలు అతనికి సరికొత​ తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీనిపై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్‌) చీఫ్‌ నీరజ్‌ కుమార్‌ను సీఓఏ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఇప్పటికే ఆదేశించారు. దాంతో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

దీనిపై బీసీసీఐ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే ఖన్నా మాట్లాడుతూ.. ' పాకిస్తాన్‌కు చెందిన మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నట్లు అతని భార్య జహాన్‌ ఆరోపించిన కేసులో విచారణ జరుగుతుంది.  దీనిపై నీరజ్‌ కుమార్‌ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం ఏడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్‌ తర్వాత భారత క్రికెట్‌ పాలక మండలి(సీఓఏ) తీసుకునే నిర్ణయంపైనే షమీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే రాబోవు ఐపీఎల్‌ సీజన్‌లో షమీ ఆడతాడా..లేదా అనేది తేలుతుంది. అప్పటివరకూ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకోలేదు' అని ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశాలకు హాజరైన సీకే ఖన్నా తెలిపారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఒకటైన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ షమీని రూ. 3 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top