ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక జట్టును ఓపెనర్ కరుణరత్నే (363 బంతుల్లో 152; 17 ఫోర్లు) తన అద్భుత సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు.
కరుణరత్నే సెంచరీ
రెండో ఇన్నింగ్స్‌లో 293/5
కివీస్‌తో తొలి టెస్టు
క్రైస్ట్‌చర్చ్: ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక జట్టును ఓపెనర్ కరుణరత్నే (363 బంతుల్లో 152; 17 ఫోర్లు) తన అద్భుత సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 125 ఓవర్లలో ఐదు వికెట్లకు 293 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (108 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించాడు.
తనకు తోడుగా క్రీజులో కౌశల్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 84/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన లంక మరో పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే కివీస్ దూకుడును కరుణరత్నే సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఎనిమిది గంటలకు పైగా ఓపిగ్గా క్రీజులో నిలిచిన తను 255 బంతుల్లో కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. అయితే ఆట చివర్లో బౌల్ట్ వడివడిగా రెండు వికెట్లు తీసి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ప్రస్తుతం శ్రీలంక మరో 10 పరుగులు వెనుకబడి ఉంది.