కోల్‌కతా ఇంటికి... హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌కు...

Mumbai Indians crush Kolkata Knight Riders by 9 wickets - Sakshi

చివరి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ చిత్తు

9 వికెట్లతో ముంబై విజయం

ముగిసిన ఐపీఎల్‌ లీగ్‌ దశ  

120 బంతుల ఇన్నింగ్స్‌లో సింగిల్‌ కూడా తీయని డాట్‌ బంతులు 60... మొత్తం ఇన్నింగ్స్‌లో మూడంటే మూడే ఫోర్లు... ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా దీనమైన బ్యాటింగ్‌ ఇది... సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ బౌలర్లు చెలరేగడంతో బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన నైట్‌రైడర్స్‌ ముందే ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆశలకు ఊపిరి పోసింది. ప్రత్యర్థిని ఓడించి ముంబై చేసిన మేలుతో నాలుగో జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

9 విజయాలు, 18 పాయింట్లతో టాప్‌–3 జట్లు సమానంగా ఉన్నా, తాజా విజయం తర్వాత రోహిత్‌ సేన రన్‌రేట్‌ కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో తర్వాతి మూడు టీమ్‌లు సమంగా నిలిచినా మెరుగైన రన్‌రేట్‌లో ‘ఆరెంజ్‌ ఆర్మీ’ ముందంజ వేసింది. ఐపీఎల్‌ చరిత్రలో 12 పాయింట్లు మాత్రమే సాధించిన టీమ్‌ సెమీస్‌/ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.   

ముంబై: గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌–2019లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. తమతో పోటీలో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఆదివారం ఇక్కడి వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడం రైజర్స్‌కు టాప్‌–4లో అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది.

క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) నెమ్మదైన ఇన్నింగ్స్‌ జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మలింగ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.
 
లిన్‌ మినహా...
ఓపెనర్‌ లిన్‌ ఆరంభంలో చూపించిన దూకుడు మినహా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ మొత్తం పేలవంగా సాగింది. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 49 పరుగులకు చేరింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్యా ... వరుస ఓవర్లలో గిల్, లిన్‌లను ఔట్‌ చేసి కోల్‌కతాను దెబ్బ తీశాడు. అంతే... ఆ తర్వాతి నుంచి కోల్‌కతా కష్టాలు మొదలయ్యాయి. 7–12 మధ్య ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్‌ 16 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే పరిస్థితి అర్థమవుతుంది! మలింగ వేసిన 13వ ఓవర్లో కోల్‌కతాకు పెద్ద దెబ్బ పడింది.

నాలుగో బంతికి దినేశ్‌ కార్తీక్‌ ఔట్‌ కాగా... సీజన్‌ ఆసాంతం జట్టు గెలుపు భారాన్ని మోసిన ఆండ్రీ రసెల్‌ (0) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. సిక్సర్‌తో ఖాతా తెరిచిన  డి కాక్‌ దూకుడు కొనసాగించి జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. డి కాక్‌ ఔటయ్యాక... రోహిత్, సూర్యకుమార్‌ సునాయాసంగా పరుగులు సాధించి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top