
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ధోని..
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. రెండో వన్డేలో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించి హ్యాట్రిక్ సాధించాడు. శిఖర్ ధావన్ వికెట్ అనంతరం అనూహ్యంగా నాలుగోస్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని.. తొలి బంతినే మ్యాక్స్‌వెల్‌కు సునాయస క్యాచ్ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో లభించిన ఈ అవకాశాన్ని ధోని అందిపుచ్చుకున్నాడు.
74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్‌లో 70వ అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఎప్పటిలానే ఎలాంటి సంబరాలు లేకుండా మరుసటి బంతికి ధోని సిద్దమయ్యాడు. ఇక ధోనికి జతగా కేదార్ జాదవ్ రాణిస్తుండటంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇంకా విజయానికి 48 బంతుల్లో 58 పరుగులు అవసరం. ఈ సిరీస్ ముందు నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోని.. ఇలా మూడు అర్ధసెంచరీలతో చెలరేగడంతో అతని అభిమానుల పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నారు.