మళ్లీ ‘మూడి’నట్లే(నా)! | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘మూడి’నట్లే(నా)!

Published Thu, Nov 26 2015 2:47 AM

మళ్లీ ‘మూడి’నట్లే(నా)!

‘ఈ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంటూ సాధ్యమైతే అది తొలి రోజు మాత్రమే’... నాగ్‌పూర్‌లో టాస్ గెలిచిన వెంటనే కోహ్లి అన్న మాట ఇది. టర్నింగ్ పిచ్‌ను తయారు చేశామని క్యురేటర్ ముందే చెప్పడంతో ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. తొలి రోజు ఆట కూడా ఊహించినట్లుగానే సాగింది. తొలి సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చూపించినా... స్పిన్నర్లు వచ్చాక పరుగుల వేగం మందగించింది. అయితే స్టెయిన్ గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలు తీసుకున్న మోర్నీ మోర్కెల్ ఓ సాధారణ పిచ్‌పై సంచలన బౌలింగ్ చేశాడు.

బంతుల్లో వైవిధ్యం చూపిస్తూ బ్యాట్స్‌మెన్‌ను అయోమయంలోకి నెట్టాడు. విజయ్, కోహ్లి, రహానేల రూపంలో మూడు కీలక వికెట్లతో భారత జోరుకు బ్రేక్ వేశాడు. రెండో సెషన్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ సహజంగానే కొంత ఒత్తిడిలోకి వెళ్లింది.
 
వ్యూహం మారింది!
తాను కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆడుతున్న కోహ్లి ఈసారి మాత్రం నలుగురు బౌలర్లకే పరిమితమయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అనుభవాలు, పిచ్ స్వభావం దృష్ట్యా రెండో పేసర్ అనవసరమని భారత్ భావించింది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు అవకాశం దక్కినా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు.

2010లో నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో రోహిత్ అరంగేట్రం జరగాల్సింది. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడ్డాడు. ఆ తర్వాత మూడేళ్లు కష్టపడితేగానీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. ఈసారి అదే మైదానంలో  దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని రోహిత్ ఊహించి ఉండడు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తనకు గొప్ప అవకాశం. వన్డేల్లో షాట్లు ఆడటం అలవాటైన భారత బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో డిఫెన్స్ ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారు. దానికి ఉదాహరణ ఈ మ్యాచ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఆటతీరు. అయితే మొత్తం మీద 215 పరుగులు చేయడం కాస్త సానుకూలాంశమే.
 
ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా బాగా నిరాశపడింది తాహిర్ విషయంలోనే. సిరీస్ ఆరంభానికి ముందు తనే తమ తురుపు ముక్కగా భావించారు. కానీ స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌లపై కూడా తను ప్రభావం చూపలేకపోతున్నాడు. అందుకే మరో స్పిన్నర్ హార్మర్‌నే సఫారీలు నమ్ముకున్నారు. తన మీద ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ హార్మర్ నాలుగు వికెట్లతో రాణించాడు.
 
బ్యాట్స్‌మెన్ తిప్పలు
ఎప్పటిలాగే అశ్విన్ మరోసారి కొత్త బంతితో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. పిచ్ మీద నిలబడటానికే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డ్యాన్స్ చేయాల్సి వస్తోంది. తొమ్మిది ఓవర్ల పాటు సఫారీ బ్యాట్స్‌మెన్ బంతి బంతికీ గండమే అన్నట్లు ఆడారు. అశ్విన్ మరోసారి ఓ చక్కటి బంతితో ఓపెనర్ వేన్‌జిల్‌ను అవుట్ చేసి కోహ్లి కోరుకున్న ఆరంభాన్ని అందించాడు. ఇక ఈ సిరీస్‌లో స్టార్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా కళ్లు చెదిరే బంతితో నైట్‌వాచ్‌మన్ తాహిర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
 
మొత్తం మీద భారత్ జట్టు తొలి రోజును సంతోషంగానే ముగించింది. అయితే దక్షిణాఫ్రికా కూడా పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్లలేదు. పడ్డ రెండు వికెట్లలో ఒకటి నైట్ వాచ్‌మన్‌దే. ఆమ్లా, డివిలియర్స్, డు ప్లెసిస్, డుమినిలలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా భారత్ స్కోరు దగ్గరకి రావచ్చు. అయితే పిచ్ స్వభావాన్ని, భారత స్పిన్నర్ల జోరును పరిగణలోకి తీసుకుంటే రెండో రోజు కనీసం రెండు సెషన్‌లైనా నిలబడతారా అనే సందేహం వస్తోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయం. అదేంటనేది రెండో రోజుకే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం తీరు చూస్తే ఇది కూడా మూడోరోజే ముగిసేలా కనిపిస్తోంది..!
- సాక్షి క్రీడావిభాగం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement