మిస్బా.. నీ ‘ఆట’లు సాగవ్‌!

Misbah And Waqar Never Liked Sarfaraz Moin Khan - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్సీ పదవి నుంచి సర్ఫరాజ్‌ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ మాజీ కెప్టెన్‌, మాజీ వికెట్‌ కీపర్‌ మొయిన్‌ ఖాన్‌ తీవ్రంగా ధ్వజమెత్తాడు. సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్ల నుంచి సారథిగా తొలగించడానికి ప్రధాన కారణంగా కొత్తగా కోచ్‌గా వచ్చిన మిస్బావుల్‌ హక్‌ కారణమని విమర్శించాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఏదో అద్భుతాలు చేయాలని చూస్తున్న మిస్బా.. సింగిల్‌గా ఏమీ సాధించలేడని విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ పాకిస్తాన్‌ క్రికెట్‌లో మిస్బా ఒక శక్తిగా ఎదగాలనుకుంటన్నాడు. అదే పని చేయదనే విషయాన్ని గ్రహించు. అసలు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా ఎందుకు తీసేయాల్సి వచ్చింది. టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్‌కు 11 వరుస సిరీస్‌లు అందించిన సర్ఫరాజ్‌ను సారథిగా ఎలా తప్పిస్తారు. మిస్బాతో వకార్‌ యూనస్‌కు సర్ఫరాజ్‌ అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు. వారి వారి వ్యక్తిగత కారణాలతోనే సర్ఫరాజ్‌ను తొలగించారు. నువ్వు పాకిస్తాన్‌ క్రికెట్‌లో అత్యంత శక్తిమంతుడిగా ఎదగాలనుకుంటున్నావ్‌. కానీ సింగిల్‌ అది వర్క్‌ ఔట్‌ కాదు’ అని విమర్శించాడు.

ఇటీవల పాకిస్తాన్‌ టెస్టు, టీ20 క్రికెట్‌ సారథిగా సర్ఫరాజ్‌ను తప్పించి అజహర్‌ అలీ, బాబర్‌ అజామ్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం వన్డే కెప్టెన్సీకి మాత్రమే సర్ఫరాజ్‌ను పరిమితం చేశారు. దాంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సర్ఫరాజ్‌ అహ్మద్‌ను తప్పించడాన్ని సమర్థిస్తే, మరికొందరు మాత్రం పీసీబీ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కాస్తా పంజాబ్‌ క్రికెట్‌ బోర్డు అయ్యిందంటూ విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతానికి చెందిన మిస్బా-వకార్‌లు తమ స్థానికత కోసం కృషి చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అజహర్‌ అలీ కూడా పంజాబ్‌ ప్రాంతానికి చెందిన వాడే కావడంతో మిస్బాపై విరుచుకుపడుతున్నారు.,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top