రాహుల్‌కు కష్టకాలం!

KL Rahul Replace Rohit Sharma Likely to Open - Sakshi

జట్టులోంచి తప్పించే అవకాశం

ఓపెనర్‌గా రోహిత్‌తో ప్రయోగం

చోటుపై గిల్, ఈశ్వరన్‌ ఆశలు

నేడు భారత జట్టు ఎంపిక

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత జట్టుకు స్వదేశంలో సిరీస్‌ అంటే నల్లేరు మీద నడకే కావచ్చు. టీమిండియా సభ్యులు పరుగుల వరద పారించేందుకు, వికెట్ల పండగ చేసుకునేందుకు రాబోయే హోం సిరీస్‌లు అవకాశమిస్తున్నాయి. వీరిలో రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌లో సుస్థిర స్థానం కోసం పోరాడుతుండగా... రాహుల్‌ స్థానంపై కత్తి వేలాడుతోంది. దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్‌ గిల్‌ కూడా తొలి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. మరి సెలక్టర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరం.     

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత నిజానికి భారత జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల పట్ల టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అసంతృప్తిగా ఉంది. పైగా సొంతగడ్డపై అయితే కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చే ప్రయోగం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక కీలకంగా మారింది. భువనేశ్వర్‌ ఫిట్‌గా లేకపోవడం వల్ల అతని పేరును పరిశీలించడం లేదు.  

వరుస వైఫల్యాలు... 
రెండున్నరేళ్ల క్రితం లోకేశ్‌ రాహుల్‌ సొంతగడ్డపై చక్కటి ఫామ్‌తో అదరగొట్టాడు. వరుసగా 7 టెస్టుల్లో 9 అర్ధసెంచరీలు సాధించాడు. అయితే ఆ తర్వాత అతని ఆట ఒక్కసారిగా గతి తప్పింది. తర్వాతి 16 టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒకే ఒకటి (ఓవల్‌లో 149) కాగా... అదీ ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోల్పోయిన తర్వాత చివరి టెస్టులో వచ్చింది. ఓపెనర్‌గా ఆ్రస్టేలియాలో మూడు టెస్టుల్లో, తాజాగా విండీస్‌పై కూడా రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌ స్థాయి ఇన్నింగ్స్‌ అతడి నుంచి రావడం లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంతో నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వరుస అవకాశాలను అతను వృథా చేసుకున్నాడు. జట్టు విజయాల హోరులో వ్యక్తిగత వైఫల్యాలు మరుగునపడినా, ఇక హెచ్చరికకు సమయం అయిందని సెలక్టర్లు భావిస్తున్నట్లున్నారు. ఈ నేపథ్యంలో మరో అవకాశంకంటే కూడా రాహుల్‌పై వేటు వేసే చాన్స్‌ ఎక్కువగా ఉంది.3, 4, 5, 6 ఓకే... భారత బ్యాటింగ్‌కు సంబంధించి నాలుగు స్థానాల విషయంలో ఎలాంటి సమస్య లేదు. పుజారా, కోహ్లి, రహానే, విహారిలు వరుసగా బరిలోకి దిగుతారు. ఇటీవల ఆట తర్వాత విహారి స్థానం పదిలంగా మారింది. వికెట్‌ కీపర్లుగా పంత్, సాహా కొనసాగుతారు.  

అదే బౌలింగ్‌... 
బౌలింగ్‌ విభాగంలో కూడా మార్పులకు అవకాశం లేదు. జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, షమీలతో కూడా పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురిలో ఎవరికైనా విశ్రాంతినివ్వాలనుకుంటే ప్రత్యా మ్నాయంగా ఉమేశ్‌ యాదవ్‌ అందుబాటులో ఉన్నాడు. అశ్విన్, కుల్దీప్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో బ్యాటింగ్‌ కారణంగా జడేజాకు మాత్రమే విండీస్‌లో ఆడే అవకాశం లభించింది. అయితే మన పిచ్‌లపై అశ్విన్‌ కచి్చతంగా ఆడతాడు కాబట్టి మార్పులు అనవసరం.
 
హార్దిక్‌ను తీసుకుంటారా? 
ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విషయంలో మాత్రం సెలక్టర్లు స్పష్టతనివ్వడం లేదు. వరల్డ్‌ కప్‌ తర్వాత విశ్రాంతి పేరుతో విండీస్‌కు ఎంపిక చేయలేదు. అతని అవసరం కూడా ఇప్పుడు టెస్టు టీమ్‌ కూర్పులో అంతగా కనిపించడం లేదు. భారత్‌లో జరిగే టెస్టుల్లో అశి్వన్, జడేజాలాంటివారు ఉన్నప్పుడు పాండ్యా బౌలింగ్‌నుంచి కూడా పెద్దగా ఆశించేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేస్తారా అనేది సందేహమే. ఈ టెస్టులకంటే పరిమిత ఓవర్లపైనే మరింత దృష్టి పెట్టమని సెలక్టర్లు సూచించినట్లు వినిపిస్తోంది.  

రోహిత్‌ నిలుస్తాడా! 
తాజా సమీకరణాల్లో రోహిత్‌ శర్మతో ఓపెనింగ్‌ ప్రయోగం చేయాలని టీమ్‌ భావిస్తోంది. రోహిత్‌ ఓపెనింగ్‌ గురించి నేరుగా ఎమ్మెస్కే ప్రసాదే మాట్లాడటం దీనికి నిదర్శనం. గంగూలీ సహా అనేక మంది మాజీలు దీనికి మద్దతు పలుకుతున్నారు. అయితే టెస్టుల్లో ఎన్నడూ రెగ్యులర్‌ ఆటగాడు కాని రోహిత్‌ రికార్డు చెప్పుకోదగిన విధంగా లేదు. ఆరేళ్ల కెరీర్‌లో అతను ఆడింది 27 టెస్టులే. మొదటి రెండు మ్యాచ్‌లలో సెంచరీ అనంతరం తన 22వ టెస్టులో రోహిత్‌ మూడో శతకం సాధించాడు. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా మ్యాచ్‌ ఆడే అవకాశమే రాలేదు. వన్డేల్లో, టి20ల్లో మిడిలార్డర్‌లో సుస్థిర స్థానం తర్వాతే అతనితో ఓపెనింగ్‌ చేయించారు. కానీ టెస్టుల్లో రోహిత్‌ ఏనాడూ గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అయితే స్వదేశంలో సిరీస్‌ కాబట్టి పిచ్‌లు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది కాకపోవచ్చనేది కూడా సెలక్టర్ల ఆలోచన. మరో ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ నిలకడగానే ఆడుతున్నాడు కాబట్టి రోహిత్‌తో ఒక ప్రయత్నం చేయవచ్చు. రోహిత్‌ కూడా తన స్థానం నిలబెట్టుకోవడం ఖాయం. 

కొత్తవారు ఎవరు? 
తుది జట్టులో స్థానం సంగతి చెప్పలేకపోయినా అనుభవం కోసం ఒకరిద్దరు కొత్త ఆటగాళ్లని ఎంపిక చేయవచ్చని సమాచారం. ఇందులో ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్, బెంగాల్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్‌ పేర్లపై చర్చ జరగనుంది. భారత్‌ తరఫున 2 వన్డేలు ఆడిన గిల్‌ ‘ఎ’ జట్టు తరఫున విశేషంగా రాణిస్తున్నాడు. ఇటీవల దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో 153 పరుగులతో అదరగొట్టిన ఈశ్వరన్‌ 52 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో దాదాపు 50 సగటుతో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌గా కూడా అనేక సార్లు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ పేరు చర్చకు వస్తున్నా... ప్రస్తుతానికి అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top