‘నయం, మిమ్మల్ని ఇంకా సీఎంని చేయలేదు’

Kiran Bedi Trolled Over France Victory - Sakshi

న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ 4 - 2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ జట్టుకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్నినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి కూడా ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. కాస్తా భిన్నంగా చెప్పడంతో ట్విటర్‌ ఫాలోవర్స్‌ కిరణ్‌ బేడిని తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్‌ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతమున్న పుదుచ్చేరి ఒకప్పడు ఫ్రెంచ్‌ వారి ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కిరణ్‌ బేడి పుదుచ్చేరి వాసులను ఒకప్పటి ఫ్రెంచ్‌ వలసవాదులుగా గుర్తిస్తూ ఇలా ట్వీట్‌ చేశారు. కానీ నెటిజన్లకు కిరణ్‌ బేడి ట్వీట్‌ నచ్చలేదు. దాంతో వారు కిరణ్‌ బేడిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మేము భారతీయులం మేడమ్‌.. మీ ప్రచార కార్యక్రమాలు ఆపండి’ అని ట్వీట్‌ చేయగా మరికొందరు ‘నేను మాత్రం మీరు భారత భూభాగానికే గవర్నర్‌ అయ్యారని భావిస్తున్నాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఫ్రెంచ్‌ వలసవాదులుగా గుర్తించి సంతోషిస్తున్నారు. ఏం చేస్తాం మా ఖర్మ. ఇంకా ఢిల్లీలో ఉన్న మూర్ఖులు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అదృష్టం అంత పని చేయలేదు’ అని ట్వీట్‌ చేశారు.

మరొక నెటిజనైతే ఇంకాస్తా ఘాటుగానే స్పందించారు. ‘నేను పుదుచ్చేరి వాసిగానే జన్మించాను. ఫ్రెంచ్‌ టీం గెలిస్తే.. నేను గెలిచనట్లు అనుకోవడం లేదు. గెలిచింది ఫ్రాన్స్.. మేము కాదు. అయినా విజయాన్ని ఆస్వాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక వలసవాదిగానే గెలుపును ఆస్వాదించనవసరం లేదు. ముందు మీ ఆలోచనా విధనాన్ని మార్చుకొండి’ అంటూ  విమర్శించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top