
విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక
దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టు హవా ఈ సీజన్‌లోనూ కొనసాగుతోంది. గత ఏడాది మూడు ప్రధాన టైటిల్స్‌ను గెలుచుకున్న కర్ణాటక ఈ సారి కూడా ప్రతిష్టాత్మక....
అహ్మదాబాద్: దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టు హవా ఈ సీజన్‌లోనూ కొనసాగుతోంది. గత ఏడాది మూడు ప్రధాన టైటిల్స్‌ను గెలుచుకున్న కర్ణాటక ఈ సారి కూడా ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కర్ణాటక 156 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా వరుసగా రెండోసారి దేశవాళీ వన్డే టోర్నీ విజేతగా నిలిచింది. ముందుగా కర్ణాటక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం పంజాబ్ 38.2 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది.
మయాంక్ సెంచరీ...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకకు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (100 బంతుల్లో 125; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (81 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్స ర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 24.2 ఓవర్లలో 162 పరుగులు జోడిం చారు. అనంతరం కరుణ్ నాయర్ (71 బంతు ల్లో 86; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించ గా, మనీశ్ పాండే (37 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. బల్‌తేజ్ సింగ్, సందీప్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 9 పరుగుల వద్దే వోహ్రా (5) వికెట్ కోల్పోయింది. అయితే మన్‌దీప్ సింగ్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 1 సిక్స్), అమితోజ్ సింగ్ (44 బంతుల్లో 46; 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 12 ఓవర్లలోనే 82 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో కర్ణాటక బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. యువరాజ్ సింగ్ (23)తో సహా ఇతర బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌కు 3, బిన్నీకి 2 వికెట్లు దక్కాయి.