సఫారీలతో మ్యాచ్: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Jhulan Goswami ruled out from T20 series against south afirca - Sakshi

పోట్చెఫ్‌స్ట్రూమ్‌: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ట్వంటీ సిరీస్‌ మొదలవ్వక ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల క్రికెట్ జట్టులో సీనియర్ క్రికెటర్, స్టార్ పేసర్ జులన్ గోస్వామి ఏకంగా మొత్తం సిరీస్‌కే దూరమైంది. కాలి గాయం కారణంగా సీనియర్ ప్లేయర్ జులన్‌ గోస్వామి జట్టు నుంచి తప్పుకున్నారని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ బౌలర్ జట్టుకు దూరం కావడం మిథాలీరాజ్‌ సేనకు ప్రతికూలాంశం. వన్డే సిరీస్‌ నెగ్గిన ఉత్సాహంతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావించిన టీమిండియాకు జులన్ లేకపోవడంతో బౌలింగ్ దళం కాస్త బలహీనమైనట్లు కనిపిస్తోంది.

ఇటీవల కాలి గాయంతో బాధపడుతోన్న జులన్‌ కి నిన్న ఎమ్మారై స్కాన్‌ టెస్ట్ చేశాం. అందులో గాయం తీవ్రమైందని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు జులన్ కు సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చామని బీసీసీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆమె స్థానంలో ఎవరికీ అవకాశం ఇస్తున్నారో మాత్రం మేనేజ్‌మెంట్ చెప్పలేదు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. వరుసగా రెండు వన్డేలు నెగ్గిన మిథాలీ సేన గాయం కారణంగా జులన్ మూడో వన్డేకు దూరమైన వన్డేలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా గోస్వామి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్‌ నిలకడగా ఆడారు. సఫారీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్‌ ఫామ్‌లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న తొలి టీ20లో ఆసక్తికర పోరు జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top