బుమ్రా డెత్‌ బౌలింగ్‌ చూశారా?

Jasprit Bumrah Displays Fierce Art Of Death Bowling In 2nd ODI - Sakshi

నాగ్‌పూర్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో డెత్‌ఓవర్‌ స్పెషలిస్ట్‌, టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. పదునైన బంతులతో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 250 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని భారత్‌ ఈ మ్యాచ్‌ నెగ్గిందంటే దానికి కారణం ముమ్మాటికి జస్ప్రిత్‌ బుమ్రానే. 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన బుమ్రా.. కేవలం 29 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. 46వ ఓవర్లో అయితే కేవలం ఒకే ఒక పరుగిచ్చి కౌల్టర్‌ నీల్‌, కమిన్స్‌ల వికెట్లు పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు.

ఎంతలా అంటే బుమ్రా బౌలింగ్‌ ఒక్కటి వదిలేద్దాం.. మిగతా బౌలర్లలో ఆడుదామని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అనుకునేంత.. ఇబ్బంది పెట్టాడు. బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టు విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే బుమ్రా, షమీ ఓవర్ల కోటా అయిపోవడం భారత శిభిరంలో కొంతకలవరపాటు గురిచేసింది. కెప్టెన్‌ కోహ్లి.. ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌కు బంతినివ్వగా.. మ్యాచ్‌ పోయిందని అందరూ భావించారు. కానీ విజయ్‌.. కెప్టెన్‌ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే స్టోయినిస్‌ను ఔట్‌ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అనంతరం మరో రెండు బంతుల్లో జంపాను ఔట్‌ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌ కూల్చాడు. అంతకు ముందు కెప్టెన్‌ కోహ్లి అద్భుత సెంచరీకి, విజయ్‌ శంకర్‌ (46) కీలక ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో భారత్‌ పొరాడే లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. ఇక బుమ్రా డెత్‌ ఓవర్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top