ఢిల్లీలోనూ  ‘సూపర్‌ కింగ్స్‌’ 

IPL 2019 Match 5 highlights: CSK beat DC by 6 wickets in last-over thriller - Sakshi

వరుసగా రెండో మ్యాచ్‌లో ధోని సేన గెలుపు

6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి

రాణించిన వాట్సన్, ధోని, బ్రేవో  

ఐపీఎల్‌లో మరో ‘నెమ్మదైన‘ రోజు... టి20 ఫార్మాట్‌కు పనికి రాని విధంగా, పరుగు పరుగుకూ శ్రమించాల్సి వచ్చిన ఫిరోజ్‌ షా కోట్లా పిచ్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ గట్టెక్కింది. తొలి మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే తరహా వికెట్‌పై ఆడిన ధోని సేన సంయమన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థి వేదికలోనూ పైచేయి సాధించింది. క్లిష్ట పరిస్థితుల్లో ధోని, జాదవ్‌ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకుముందు ధావన్‌ పుణ్యమా అని ఢిల్లీ క్యాపిటల్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. అయినా చివరకు సొంతగడ్డపై టీమ్‌కు ఓటమి తప్పలేదు.   

ఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌–12లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. డ్వేన్‌ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వాట్సన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రైనా (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఎమ్మెస్‌ ధోని (35 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జాదవ్‌ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో సూపర్‌ కింగ్స్‌ విజయతీరం చేరింది.  

ధావన్‌ తడబడుతూనే... 
ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అందుకు ఓపెనర్‌ ధావనే కారణం. బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌పై అతను పరుగుల కోసం తీవ్రంగా శ్రమించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలచిన అతను ఆ తర్వాత కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తాహిర్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన తర్వాత బ్రేవో ఓవర్లోనూ వరుసగా మరో రెండు బౌండరీలు బాదాడు. 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బ్రేవో బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.  

శుభారంభం చేసినా... 
క్యాపిటల్స్‌ జట్టు మూలస్థంభాల్లాంటి ముగ్గురు యువ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరును సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫోర్‌తో పరుగుల ఖాతా తెరచిన పృథ్వీ షా (16 బంతుల్లో 24; 5 ఫోర్లు)... శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. అయితే అది ఎంతో సేపు సాగలేదు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (20 బంతుల్లో 18; 1 సిక్స్‌) కూడా తాహిర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఢిల్లీ ఆశలు పెట్టుకున్న రిషభ్‌ పంత్‌ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడబోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. హర్భజన్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది.  

టపటపా... 
15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 118/2 కాగా ధావన్, పంత్‌ క్రీజ్‌లో ఉన్నారు. వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి చివరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు రావచ్చని అనిపించింది. అయితే బ్రేవో వేసిన 16వ ఓవర్లోనే పంత్, ఇంగ్రామ్‌ (2) వెనుదిరగ్గా... తర్వాతి ఓవర్లో కిమో పాల్‌ (0)ను జడేజా బౌల్డ్‌ చేశాడు. మరుసటి ఓవర్లోనే ధావన్‌ను కూడా బ్రేవో వెనక్కి పంపడంతో క్యాపిటల్స్‌ తక్కువ స్కోరు పరిమితమైంది. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ కేవలం 2 ఫోర్లతో 29 పరుగులే సాధించగలిగింది.  

ఆకట్టుకున్న వాట్సన్‌... 
గత మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన చెన్నై ఓపెనర్‌ వాట్సన్‌ ఈసారి తన ధాటిని ప్రదర్శించాడు. అక్షర్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, రబడ తొలి ఓవర్లో కూడా వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అమిత్‌ మిశ్రా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన వాట్సన్‌... అదే ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో ఉన్న సమయంలో రెండు సార్లు వాట్సన్‌కు ఇషాంత్, రబడలతో వాగ్వాదం జరిగింది. మరో ఓపెనర్‌ రాయుడు (5) నిరాశపర్చగా.. రైనా కూడా చక్కటి స్ట్రోక్‌లతో అలరించాడు. ముఖ్యంగా ఇషాంత్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి.  

కీలక భాగస్వామ్యం... 
చెన్నై విజయానికి 58 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో జాదవ్, ధోని జత కలిశారు. పిచ్‌ మరీ నెమ్మదించడంతో వీరిద్దరు ఒక్కో పరుగు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి బ్యాట్స్‌మెన్‌ను నిరోధించారు. ఈ దశలో అక్షర్‌ మూడు ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చాడు. 18 పరుగుల వద్ద జాదవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్‌ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. చివరి 8 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని భారీ సిక్సర్‌ బాదడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. జాదవ్‌ ఔటైనా... బ్రేవో (4 నాటౌట్‌) బౌండరీతో 2 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.  

ఐపీఎల్‌లో నేడు 
కోల్‌కతా (vs) పంజాబ్‌ 
వేదిక: కోల్‌కతా 
రాత్రి గం. 8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top