రియోలో స్వాగత సందడి | Indians look upbeat at Welcome Ceremony at Olympic Village | Sakshi
Sakshi News home page

రియోలో స్వాగత సందడి

Aug 4 2016 2:12 AM | Updated on Sep 4 2017 7:40 AM

రియోలో స్వాగత సందడి

రియోలో స్వాగత సందడి

బ్రెజిల్ సంస్కృతిని తెలిపే నృత్యాలతో బుధవారం క్రీడాగ్రామం సందడిగా మారింది. ఆటపాటలతో బ్రెజిల్ కళాకారులు ఒలింపియన్లకు ఘనస్వాగతం పలికారు.

రియో డి జనీరో : బ్రెజిల్ సంస్కృతిని తెలిపే నృత్యాలతో బుధవారం క్రీడాగ్రామం సందడిగా మారింది. ఆటపాటలతో బ్రెజిల్ కళాకారులు ఒలింపియన్లకు ఘనస్వాగతం పలికారు. భార త బృందంతో పాటు బహమాస్, నార్వే, బర్కినా ఫసో, గాంబియా క్రీడాకారులు కూడా ఈ అధికారిక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఉల్లాసంగా గడిపారు. తొలుత జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో గిరిజన నృత్యాలు అలరించాయి. అనంతరం బ్రెజిలియన్ దిగ్గజ సంగీత దర్శకులు రౌల్ సేక్సస్, టిమ్ మైయా స్వరపరిచిన బాణీలతో పాటు లేటెస్ట్ హిట్‌సాంగ్స్, ఫర్, సాంబా నృత్యాలతో కళాకారులు భారత బృందానికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం జత వెండి ఏనుగులు, బంగారు నెమలి ప్రతిమలతో క్రీడాగ్రామం మేయర్ జనేత్ ఆర్కేన్‌ను సత్కరించింది. అనంతరం ఒలింపిక్ క్రీడల ప్రాశస్త్యం గురించి జనేత్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి షూటర్లు జీతూరాయ్, ప్రకాశ్ నంజప్ప, గుర్‌ప్రీత్ సింగ్, చెయిన్ సింగ్, అథ్లెట్లు కుశ్‌బీర్ కౌర్, మన్‌ప్రీత్ కౌర్, మహిళల హాకీ జట్టు, స్విమ్మర్లు సాజన్, శివానితో పాటు పలువురు కోచ్‌లు, అధికారులు హాజరయ్యారు. ఈసారి భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 120 మంది క్రీడాకారులు రియోలో పోటీపడనున్నారు. ఇప్పటికే రియో చేరుకున్న భారత క్రీడాకారులకు బారా ఒలింపిక్ పార్క్‌కు సమీపంలో ఉన్న  31వ నంబరు భవంతిని కేటాయించారు.

 కుర్చీలు, టీవీలు కొనే పనిలో...
భారత హాకీ జట్టుకు కావాల్సిన టీవీ సెట్లను, కుర్చీలను సమకూర్చడంలో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ విఫలమైంది. అదనపు కుర్చీలు కావాలని కోరుతూ భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా చేసిన విజ్ఞప్తికి నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో భారత ఎంబసీ ద్వారా రాకేశ్ టీవీలు, కుర్చీలు కొనుగోలు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇవి ఆటగాళ్లకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement