ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు పరాజయం పాలయ్యాయి.
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు పరాజయం పాలయ్యాయి. జపాన్‌లోని కకమిగహరలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల జట్టు 4-5 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో, మహిళల జట్టు 1-2తో జపాన్ చేతిలో ఓటమి చవిచూశాయి.
పురుషుల విభాగంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గుర్జిందర్ సింగ్ (24వ ని.), అమిత్ రోహిదాస్ (30వ ని.), మన్‌ప్రీత్ సింగ్ (40వ ని.), మలక్ సింగ్ (49వ ని.) గోల్స్ చేశారు. పాకిస్థాన్ జట్టు తరఫున అబ్దుల్ హసీమ్‌ఖాన్ (2వ ని.), ఇమ్రాన్ (35వ ని.), మహ్మద్ రిజ్వాన్ (36, 44వ ని.) రిజ్వాన్ జూనియర్ (53వ ని.) గోల్స్ సాధించారు. శుక్రవారం భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది.
మహిళలకు తొలి ఓటమి
భారత మహిళల జోరుకు ఆతిథ్య జపాన్ బ్రేకులేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో కంగుతింది. చంచన్ దేవి (33వ ని.) గోల్‌తో తొలి అర్ధభాగంలో 1-0తో ఆధిక్యం కనబర్చినప్పటికీ ప్రత్యర్థి జట్టు తరఫున అరాయ్ మజుకి (59వ ని.), ఒత్సుకా షిహో (61వ ని.) గోల్ చేయడంతో భారత్ ఓడింది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 4-2తో చైనాను, 5-1తో మలేసియాను ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో భారత్, జపాన్‌లే మళ్లీ తలపడతాయి.