బంగ్లా ఓపెనర్లు.. 6,6,6,6..!

 India vs Ban: India Strike Early After Declaring Overnight - Sakshi

ఇండోర్‌: టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఇందుకు బంగ్లా ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లామ్‌-ఇమ్రుల్‌లు వేదికయ్యారు. ఈ ఇద్దరూ తమ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి వార్తల్లో నిలవలేదు.. పేలవ ప్రదర్శన చేసి హైలైట్‌ అయ్యారు. బంగ్లాదేశ్‌  తొలి ఇన్నింగ్స్‌లో షాదమ్‌న్‌ 24 బంతులు ఆడి 1 ఫోర్‌ సాయంతో 6 పరుగులు చేయగా, ఇమ్రుల్‌ 18 బంతుల్లో 1 ఫోర్‌తో 6  పరుగులే చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కూడా వీరిద్దరూ అదే వ్యక్తిగత  స్కోరు వద్ద ఔట్‌ కావడంతో హాట్‌ టాపిక్‌ అయ్యారు. 

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో షాద్‌మన్‌ 24 బంతులు ఆడి 6 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఇక ఇమ్రుల్‌ సైతం 6 పరుగులే చేశాడు. కాకపోతే ఇక్కడ ఇమ్రుల్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ బంతులు కంటే తక్కువ బంతులే ఆడాడు.  బంగ్లా ఓపెనర్లు ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తలో ఆరు పరుగులు చేసి ఔట్‌ కావడంతో 6,6,6,6 అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఇంకో విచిత్రమేమిటంటే తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌కు ఔటైన ఇమ్రుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అతనికే చిక్కాడు. మరొకవైపు షాద్‌మన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ శర్మకు వికెట్‌ను సమర్పించుకుంటే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతనికే ఔటయ్యాడు. ఇంకా చిత్రమేమిటంటే వీరిద్దరూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే ఓవర్‌లో ఔట్‌ కావడం. ఇమ్రుల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌లో వికెట్‌ కోల్పోతే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరో ఓవర్‌లోనే ఔటయ్యాడు. షాద్‌మన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌లో వికెట్‌ను చేజార్చుకుంటే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇక్కడ షాద్‌మన్‌ రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ ఏడో ఓవర్‌ చివరి బంతికే ఔట్‌ కావడం గమనార్హం. ఇమ్రుల్‌ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి ఔటైతే, రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ మొదటి బంతికి పెవిలియన్‌ చేరాడు.(ఇక్కడ చదవండి: ‘సగర్వా’ల్‌ 243)

కాగా, బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఉమేశ్‌, ఇషాంత్‌లు తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకోగా, మహ్మద్‌ షమీ మరో రెండు వికెట్లు సాధించాడు. కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(7), మహ్మద్‌ మిథున్‌(18)లను పెవిలియన్‌కు పంపాడు. దాంతో లంచ్‌కు లోపే బంగ్లాదేశ్‌ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. అంతకముందు  భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 493/6  వద్ద డిక్లేర్డ్‌ చేయగా, బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల వద్ద ఆలౌటైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top