జింబాబ్వే పర్యటనలో వరుస విజయాలు సాధించిన భారత్కు తొలి ఓటమి ఎదురైంది.
హరారే: జింబాబ్వే పర్యటనలో వరుస విజయాలు సాధించిన భారత్కు తొలి ఓటమి ఎదురైంది. జింబాబ్వేతో చివరి, రెండో టి-20లో టీమిండియా 10 పరుగులతో ఓటమి చవిచూసింది. దీంతో రెండు టి-20ల సిరీస్ 1-1తో సమమైంది. భారత్తో వన్డే సిరీస్లో వైట్వాష్ చేయించుకున్న జింబాబ్వే ఎట్టకేలకు ఆఖరి మ్యాచ్లో ఓదార్పు విజయం సాధించింది. ఈ మ్యాచ్తో జింబాబ్వేలో భారత పర్యటన ముగిసింది.
రెండో టి-20లో 146 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రహానే సేనే ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 135 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 42, స్టువర్ట్ బిన్నీ 24, సంజూ శాంప్సన్ 19 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్ క్రెమర్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. చిబాబా (67) హాఫ్ సెంచరీతో రాణించడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మసకద్జా 19, విలియమ్స్ 17 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, మోహిత్ శర్మ చెరో రెండు, సందీప్ శర్మ, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ తలా వికెట్ తీశారు.