భారత్‌ జోరు

India Continues Its Outstanding Performance At 13th South Asian Games In Nepal - Sakshi

టెన్నిస్, ఖోఖో, టీటీలో స్వర్ణాలు

దక్షిణాసియా క్రీడలు

కఠ్మాండు: భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో ‘పసిడి’పట్టు పట్టారు. బుధవారం జరిగిన పలు ఈవెంట్ల ఫైనల్లో భారత ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, ఖోఖో పోటీల్లో భారత మహిళలు, పురుషులు బంగారు పతకాలు సాధించారు. టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్లో భారత జోడీలే టైటిల్‌ పోరులో తలపడ్డాయి. దీంతో స్వర్ణాలతోపాటు  రజతాలు లభించాయి. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో హర్మీత్‌ దేశాయ్‌–ఆంథోని అమల్‌రాజ్‌ జోడీ 8–11, 11–7, 11–7, 11–5, 8–11, 12–10తో సానిల్‌ శెట్టి–సుధాన్షు గ్రోవర్‌ జంటపై గెలుపొందింది. మహిళల ఫైనల్లో ఆకుల శ్రీజ–మధురిక పాట్కర్‌ జంట 2–11, 11–8, 11–8, 11–6, 5–11, 11–5తో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ జోడీపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హర్మీత్‌–సుతీర్థ ద్వయం 11–6, 9–11, 11–6, 11–6, 11–8తో అమల్‌రాజ్‌–ఐహిక జంటపై గెలిచింది.

ఖోఖో పురుషుల ఫైనల్లో భారత్‌ 16–9తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించగా, మహిళల తుదిపోరులో 17–5తో ఆతిథ్య నేపాల్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి, అష్మిత, పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ, ఆర్యమన్‌ టాండన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో భారత కోచ్‌ గోపీచంద్‌ తనయ గాయత్రి 21–15, 21–16తో మహూర్‌ షాజాద్‌ (పాక్‌)పై, అష్మిత 21–9, 21–7తో పాల్వశ బషీర్‌ (పాక్‌)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ 21–12, 21–17తో మురద్‌ అలీ (పాక్‌)పై, ఆర్యమన్‌ 21–17, 21–17తో రంతుష్క కరుణతిలకే (శ్రీలంక)పై విజయం సాధించారు.  దక్షిణాసియా క్రీడల్లో నాలుగో రోజు బుధవారం భారత్‌ ఏకంగా 29 పతకాలు సాధించింది. ఇందులో 15 స్వర్ణాలున్నాయి. మొత్తంమీద భారత్‌ 71 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 32 పసిడి పతకాలతో పాటు 26 రజతాలు, 13 కాంస్యాలు గెలిచింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top